Friday, May 20, 2022

నారాయణ అరెస్టుపై న్యాయపోరాటం చేస్తాం, వైసీపీ వైఫల్యానికి ఇది పరాకాష్ట: కనకమేడల

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత నారాయణ అరెస్టుపై న్యాయపోరాటం చేస్తామని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. మంగళవారం ఢిల్లీలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కేసులు, అరెస్టులు ప్రజాస్వామ్యంలో సహజమేనని, కానీ నారాయణను అరెస్టు చేసిన విధానం ఏమాత్రం సరికాదని వ్యాఖ్యానించారు. అసలు ప్రశ్నాపత్రాలు లీకే కాలేదని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గత నెల 24న ప్రకటించినప్పుడు, లీకేజి కేసు ఎక్కణ్ణుంచి వచ్చిందని ప్రశ్నించారు. గిరిధర్ అనే ఓ వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా మాజీ మంత్రి నారాయణ పాత్రను ఎలా నిర్థరిస్తారని ప్రశ్నించారు.

దర్యాప్తు విధానాన్నే అపహాస్యం చేస్తూ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌ను తమకు నచ్చినట్టుగా వినియోగిస్తూ ఒక వ్యక్తిని భయపెట్టి వాంగ్మూలం నమోదు చేసుకుని, దాని ఆధారంగా కక్షసాధింపు అరెస్టులకు పాల్పడుతున్నారని కనకమేడల మండిపడ్డారు. ఒకవేళ నిజంగానే ప్రశ్నాపత్రాలు లీకైతే అందుకు ప్రభుత్వోద్యోగులు, సంబంధిత శాఖా మంత్రి బాధ్యులవుతారని, మరి వారిపై చర్యలేవి అంటూ ధ్వజమెత్తారు. మరో రాష్ట్రంలో ఉన్న వ్యక్తిని అరెస్టు చేసే సమయంలో అనుసరించాల్సిన విధానాన్ని కూడా అమలు చేయలేదని ఆరోపించారు. పైగా నారాయణ తన కుమారుడి వర్ధంతి కార్యక్రమంలో ఉన్నప్పుడు అరెస్టు చేశారంటే, దీని వెనుక అసలు కారణాలేంటో అందరికీ అర్థమవుతున్నాయని వ్యాఖ్యానించారు. “నారాయణ ఏమైనా ఉగ్రవాదా? లేక ఎక్కడికైనా పారిపోతారా? ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి” అని డిమాండ్ చేశారు.

రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీసే పరిస్థితికి తీసుకొచ్చి, కనిపించిన చోటల్లా అప్పులు చేస్తూ అన్ని రకాలుగా వైఫల్యం చెందిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికి, వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారని కనకమేడల రవీంద్ర కుమార్ ఆరోపించారు. పైగా తప్పుడు కేసులు పెట్టడమేగాక, నిర్దోషినని నిరూపించుకోవాల్సిన బాధ్యత నిందితుడిదే అంటున్నారని, నిజానికి పోలీసులు కేసులు నమోదు చేసినప్పుడు, నేరాన్ని నిరూపించాల్సి బాధ్యత పోలీసులపైనే ఉంటుందని తెలిపారు. ఇదే లాజిక్ అవినీతి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డి కూడా తాను నిర్దోషినని నిరూపించుకోవాలి కదా అని సూత్రీకరించారు. చట్టం తన పని తాను చేసుకుపోవడం లేదని, చట్టం వైఎస్సార్సీపీ చుట్టంగా మారి పనిచేస్తోందని విమర్శించారు.

పొత్తులపై ఉలికిపాటు దేనికి?
రాష్ట్రంలో వివిధ రాజకీయ పార్టీల పొత్తుల వ్యవహారంపై కూడా టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ స్పందించారు. పొత్తులు లేకుండానే వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయాలు చేశారా అని ప్రశ్నించారు. ఇప్పుడు జగన్ సైతం లోపాయికారిగా, లాలూచీ రాజకీయాలు చేయడం లేదా అన్నారు. వైఎస్సార్సీపీతో పొత్తులు పెట్టుకోడానికి ఏ పార్టీ సిద్ధంగా లేదని, తమతో ఎవరూ లేరన్న అక్కసుతోనే పొత్తులపై అలా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement