Sunday, May 26, 2024

Follow up | విశాఖలో మిచౌంగ్‌ అలజడి.. ఎగిసిపడుతున్న అలలు

విశాఖపట్నం , ప్రభన్యూస్‌ బ్యూరో : విశాఖలో మిచౌంగ్‌ తుపాన్‌ అలజడి నెలకొంది. సోమవారం సాయంత్రానికి దీని తీవ్రత అధికమైంది. అసలే ఇక్కడ సముద్రంలో అండర్‌ కరెంట్‌ తీవ్రత అధికంగా ఉంటుంది. దానికితోడు ఇక్కడ పలు ప్రాంతాల్లో గతంలో సముద్రం కోతకు గురికాగా నష్టనివారణ చర్యలు చేపట్టలేదు. ఒక వైపు భారీ వర్షం, మరో వైపు ఈదురు గాలులతో నగరంలోని అనేక ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. జనజీవనం స్థంభించింది. మరో వైపు లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరింది. మత్స్యకారులు వేటకు వెల్లకపోయినప్పటికి ఫిషింగ్‌ హార్బర్‌లో బోట్లు కాపాడుకోవడానికి అత్యధికమంది అక్కడే ఉండిపోయారు.

- Advertisement -

మరో వైపు తీరంలో లంగరవేసిన బోట్లు ఎక్కడ సముద్రంలో కొట్టుకుపోతాయని వీరంతా ఆందోళన చెందుతున్నారు. అయితే విశాఖ సాగరతీరంలో అలల ఉదృతి పెరిగింది. ఉవ్వెత్తున అలలు ఎగిసిపడుతున్నాయి. తీర ప్రాంతం కోతకు గురవుతుంది. మరో వైపు చిన్నా, చిత క ఆస్థినష్టం సంభవించినప్పటికి ఎటువంటి ప్రాణ నష్టం సంభవించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇక్కడ ఫిషింగ్‌ హార్బర్‌ నుంచి భీమిలి మంగమారిపేట వరకు తీరప్రాంతంలో పలు ప్రాంతాలు తుఫాన్‌ దాటికి ప్రమాదకరంగా మారాయి.

అయితే కొన్ని చోట్ల నిలిపి ఉంచిన బోట్లు మాత్రం స్వల్ప నష్టానికి గురయ్యాయి. విశాఖలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కుండపోత వర్షంతో పాతనగరంలో డ్రైనేజీ వ్యవస్థ అస్థవ్యస్థంగా మారింది. ఇక్కడ 60 ఏళ్ల నాటి డ్రైనేజీ వ్యవస్థ మాత్రమే ఉండగా అందులో కాలువలు వరదనీటితో పొంగి ప్రవహిస్తున్నాయి. తుఫాన్‌ సందర్భంగా జిల్లా అధికార యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టింది. కలెక్టర్‌ మల్లిఖార్జున ఆధ్వర్యంలో తుఫాన్‌ తీవ్రత ఎదుర్కొవడానికి అధికారులు అప్రమత్తయ్యారు.

జిల్లా కలెక్టర్‌ కార్యాలయంతో పాటు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోనూ పలు కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా జీవీఎంసీ వివిధ జోనల్‌ కార్యాలయాల్లో ప్రత్యేకంగా అధికారులను నియమించింది. అయితే మంగళవారం నాటికి తుఫాన్‌ తీవ్రత అధికంగా ఉంటుందని భావించి ఇప్పటికే జిల్లాలో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. మరో వైపు ఎప్పటికప్పుడు సాగరతీరంలో సందర్శకులకు ఎటువంటి ప్రమాదం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అన్ని విభాగాల ను అప్రమత్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement