Wednesday, May 8, 2024

ద‌ళితుల‌కు చెందిన నాలుగు వేల ఎక‌రాల భూములు చంద్ర‌బాబు అండ్ కో కొట్టేశారు….ఎమ్మెల్యే ఆర్కే..

మంగళగిరి: చట్టాలకు వ్యతిరేకంగా దళితుల భూములు కొట్టేసినవారంతా శిక్ష అనుభవించక తప్పదని, ఆధారాలతో సహా సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశానని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. తప్పు చేసినవారు తప్పించుకోలేరన్నారు. అసైన్డ్‌ భూములను బదలాయించడానికి.. అమ్మడానికి అవకాశం లేకుండా చట్టాలు ఉన్నాయన్నారు. కానీ, గతంలో సీఆర్‌డీఏ చైర్మన్‌గా ఉన్న చంద్రబాబు చట్టాలను తుంగలో తొక్కారని ఎమ్మెల్యే ఆర్కే మండిపడ్డారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘గత కొంతకాలం క్రితం మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి ఎ్రరబాలెం, బేతపూడి, నవలూరు గ్రామాలకు సంబంధించిన కొంత మంది ఎస్సీ, ఎస్టీ సోదరులు వచ్చి.. అన్నా మా భూములను గత ప్రభుత్వం బెదిరించి లాక్కున్నారు.. న్యాయం చేయండి అని కంప్లయింట్‌ ఇచ్చారు. రైతులు ఇచ్చిన కంప్లయింట్‌పై ఎలా జరిగింది.. ఏంటీ..? అని ఆరా తీస్తే.. సీఆర్‌డీఏ చైర్మన్‌గా చంద్రబాబు, వైస్‌ చైర్మన్‌గా నారాయణ ఉండి దళితుల భూములు చట్టాలకు వ్యతిరేకంగా కొట్టేశారు. లోతుగా వెళ్లి సాక్షాధారాలు సమీకరించుకొని సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశాను.
పీఓటీ చట్టం 1977 ప్రకారం ఎస్సీ, ఎస్టీ సోదరులు బతకడానికి, వారి జీవన భృతి కోసం అప్పటి ప్రభుత్వాలు చట్టాలు చేసి మరీ.. భూములు ఇచ్చారు. ఆ చట్టాలను ఉల్లంఘించి చంద్రబాబు తప్పు చేశారు. మంగళగిరి నియోజకవర్గంలోనే ఎస్సీ, ఎస్టీలకు చెందిన సుమారు 500 ఎకరాలు కాజేశారు. తాడికొండలో సుమారు 3500 ఎకరాల భూములు లాక్కున్నారు. రాజధాని ప్రకటనకు ముందే తన బినామీలకు చెప్పి ఎస్సీ, ఎస్టీ సోదరుల భూములు బలవంతంగా లాక్కున్నారు. ఎట్టి పరిస్థితుల్లో దీని నుంచి ఎవరూ తప్పించుకోరు. రెవెన్యూ అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి రికార్డులు తారుమారు చేశారు. కేబినెట్‌ ఆమోదం లేకుండా భూములను ల్యాండ్‌ పూలింగ్‌లో చేర్చారు. సమగ్ర విచారణ చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని సీఐడీ అధికారులను కోరుతున్నా’ అని ఎమ్మెల్యే ఆర్కే అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement