Sunday, May 19, 2024

AP | ఉరుములు, మెరుపుల వాన.. పిడుగు పాటుకు ముగ్గురు మృతి..

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తొంది. సాయంత్రానికి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఏలూరు, విజయవాడ, గుంటూరుతో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. అయితే ఈ వర్షం కారణంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పిడుగులు పడి ముగ్గురు మృతి చెందారు.

ఏలూరు జిల్లా లింగపాలెం మండలం యడవల్లి గ్రామానికి చెందిన పరసా రామారావు (41) పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. పశువులను మేపేందుకు పొలంలో ఉండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పిడుగుపాటుతో పశువులు కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది.

ఏలూరు జిల్లా ముసునూరు మండలంలో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. వందల ఎకరాల్లో అరటి పంట ధ్వంసమైంది. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గుడివాడలో గాలివాన బీభత్సం సృష్టించింది. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. భారీ వృక్షాలు నేలకొరిగాయి.

పల్నాడులో పిడుగుపాటుకు తల్లీ కూతురు మృతి..

పల్నాడు జిల్లా క్రోసూరు మండలం ఊటుకూరులో పిడుగుపాటుకు తల్లీ కూతుళ్లు మృతి చెందారు. పొలం నుంచి ఇంటికి వస్తుండగా పిడుగుపడి బొండాల నాగేంద్రం (52), యండ్రపల్లి నాగరాణి (25) మృతి చెందారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement