Sunday, May 19, 2024

AP – ఆ ముగ్గురూ మోసగాళ్లే – వాళ్లతోనే మీ బిడ్డ పోరాటం – జగన్


ఆంధ్రప్రభ స్మార్ట్, రేపల్లె ప్రతినిధి: మనం ముగ్గురు మోసగాళ్లతో పోరాడుతున్నాం.. మళ్లీ చంద్రబాబు సూపర్ సిక్స్ అంటున్నాడు. సూపర్ సెవెన్ అంటాడు.. ఇంటింటికీ కేజీ బంగారం ఇస్తారంట? ఇంటింటికీ బెంజికారు కొనిస్తారట, నమ్ముతారా?ఒక్కసారి ఆలోచన చేయాలని సీఎం జగన్ ప్ర‌శ్నించారు. బాపట్ల జిల్లా రేపల్లెలో సోమవారం ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ.. 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు ఇదే ముగ్గురితో కలిసి కూటమిగా ఏర్పడి ఈ పాంప్లెట్ మీద స్వయంగా సంతకం పెట్టి. ప్రధాన హామీల పేరుతో సంతకం పెట్టిన ఈ పాంప్లెట్టును ప్రతి ఇంటికి పంపించాడు. మరి ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ఇందులో చెప్పినవి ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా అని ప్రశ్నించారు. రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. మరి రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాల మాఫీ జరిగిందా?పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు. అక్కాచెల్లెమ్మల పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు. ఏకంగా రూ.14,205 కోట్లు పొదుపు సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తానన్నాడు. ఇందులో ఒక్క రూపాయైనా మాఫీ చేశాడా? అని ప్రశ్నించారు.

మాట్లాడేవ‌న్నీ అబ‌ద్ధాలే..

ఆడ బిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు మీ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నాడు.రూ.25 వేల కథ దేవుడెరుగు ఒక్కరి ఖాతాలో అయినా కనీసం ఒక్క రూపాయి అయినా డిపాజిట్ వేశాడా? అని ప్రశ్నించారు. ఇంటింటికీ ఉద్యోగం. ఉద్యోగం ఇవ్వకపోతే రూ.2 వేలు నిరుద్యోగ భృతి ప్రతి నెలా అన్నాడు. ఐదేళ్లు అంటే 60 నెలలు, నెలకు రెండు వేలు చొప్పున ప్రతి ఇంటికీ రూ.1,20,000 ఇచ్చాడా?అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నారు. ఇన్ని వేల మంది ఇక్కడున్నారు కదా. చంద్రబాబు హయాంలో చంద్రబాబు మీలో ఏ ఒక్కరికైనా కూడా ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చారా? అని సీఎం జగన్ ప్రశ్నించారు. రూ.10,000 కోట్లతో బీసీ సబ్స్టేన్, చేనేత పవర్ లూమ్స్ రుణాల మాఫీ అన్నాడు.. అయ్యిందా? విమెన్ ప్రొటెక్షన్ ఫోర్సు ఏర్పాటు చేస్తామన్నాడు.. చేశాడా?. సింగపూరుకు మించి అభివృద్ధి చేస్తామన్నాడు.. చేశాడా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు జరిగిందా? మన రేపల్లెలో ఏమైనా కనిపిస్తోందా? మరి ఆలోచన చేయమని అడుగుతున్నా కనీసం ఒక్కదించే ఒక్కటైనా అయిందా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు. నేను అడుగుతున్నా పోనీ ప్రత్యేక హోదా అయినా ఇచ్చాడా? దాన్నీ అమ్మేశాడు. మరి నేను అడుగుతున్నా. ఇలాంటి వాళ్లను నమ్మొచ్చా?అని సీఎం జగన్ ప్రశ్నించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement