Sunday, May 5, 2024

118ఏళ్ళ చ‌రిత్ర ఉన్న గ్రంధాల‌యం-సంద‌ర్శించిన వెంక‌య్య‌నాయుడు..

ఊరికో గ్రంథాలయం – ఇంటికో స్వచ్ఛాలయం నినాదం కావాలని, స్వచ్ఛ భారత్‌లా గ్రంథపఠనం ప్రజాఉద్యమ రూపు దాల్చాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు తెలిపారు. విజయవాడలోని చారిత్రక రామ్మోహన్ గ్రంథాలయాన్ని సందర్శించిన సందర్భంగా స్వర్ణభారత్ ట్రస్ట్ తరుఫున రూ.2.5 లక్షలు, ముప్పవరపు ఫౌండేషన్ నుంచి రూ.2.5 లక్షల చొప్పున మొత్తం రూ.5 లక్షలను గ్రంథాలయ అభివృద్ధి కోసం విరాళంగా ప్రకటించారు. అనంతరం ఆయన మనోగతాన్ని ఫేస్ బుక్ వేదికగా ఉపరాష్ట్రపతి పంచుకున్నారు. చారిత్ర ప్రదేశాలను యువత సందర్శించిన స్ఫూర్తిని పొందాలని ఆయన ఆకాంక్షించారు.దాదాపు 118 ఏళ్ళ చరిత్ర ఉన్న రామ్మోహన్ గ్రంథాలయ సందర్శన ఎంతో ఆనందాన్ని అందించిందని.. గ్రంథాలయ ఉద్యమానికి, ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం ఏర్పాటుకు ఈ సంస్థ కేంద్రబిందువుగా నిలిచిందన్నారు.

గ్రంథాలయ అభివృద్ధిలో నాటి కార్యదర్శి అయ్యంకి వెంకటరమణయ్య కృషిని ప్రస్తావించిన ఆయన, ఎంతోమంది మహనీయులు చందాలు పోగేసి, అప్పు చేసి ఈ గ్రంథాలయ స్థలాన్ని కొన్న సంఘటన ప్రేరణ కలిగిస్తుందని తెలిపారు. యువత తలచుకుంటే చరిత్ర గతి మారుతుందని.. గ్రంథాలయ అభివృద్ధికి యువత కృషి చేయాలని ఆకాంక్షించారు.పుస్తకాలు ఓ మతానికో, ఓ కులానికో, ఓ వర్గానికో పరిమితం కావని.. శరీరానికి వ్యాయామం ఎంత ముఖ్యమో, మెదడును చైతన్యం చేయడానికి పుస్తకాలు అంతే ముఖ్యమని తెలిపారు. అయితే ప్రస్తుతం టీవీ, ఇంటర్నెట్ సంస్కృతి కారణంగా సమాజంలో క్రమంగా పఠనాసక్తి తగ్గిపోయిందని.. టీవీలకు పరిమితం కావడం, కంప్యూటర్ లో, మొబైల్ లో పుస్తకాలు చదివే అలవాటు కారణంగా అనేక శారీరక, మానసిక సమస్యలు వస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. అక్ష గ్రంథాలయ సందర్శన గాంధీ మహాత్ముని స్మృతుల్ని గుర్తు చేసిందన్న ఉపరాష్ట్రపతి, మూడుసార్లు మహాత్ముడు ఈ ప్రదేశాన్ని సందర్శించిన విషయాన్ని గుర్తు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement