Thursday, May 9, 2024

ఎడతెరిపి లేని వాన.. జనజీవనం అస్తవ్యస్తం..

  • వరదలో చిక్కుకున్న ఇద్దరు
  • ఇసుక మేటలో కూరుకుపోయిన బస్సు
  • టూరిస్ట్ బస్సులో 30 మంది ప్రయాణికులు
  • పలు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు
  • గోదావరిలో క్రమేణా పెరుగుతున్న నీటి ప్రవాహం

వరంగల్: మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వాగులు, ఒర్రెలు వరద నీటితో పొంగి ప్రవహిస్తున్నాయి. కాజువేలు, వంతెనల మీదుగా వరద నీరు పోతుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద నీరు ఇళ్లలోకి చేరుతుంది. ముఖ్యంగా ములుగు, భూపాలపల్లి జిల్లాల్లోని అటవీ గ్రామాల్లో జనజీవనం స్తంభించింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ములుగు జిల్లాలో ఏటూరునాగారం, కమలాపురం మధ్యలో ఉన్న జీడివాగు ప్రమాదకరంగా ప్రవహిస్తుంది. వెంకటాపురం- పాలంపేట మధ్య రోడ్డుపై చెట్టు కూలటంతో రాకపోకలు ఆగిపోయాయి. నర్సంపేట మండలం లక్నెపల్లి గ్రామం నుంచి 30 మంది ఒక టూరిస్టులో బస్సులో కాళేశ్వరం వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న టూరిస్ట్ బస్సు కాళేశ్వరం సమీపంలోని అన్నారం క్రాస్ వద్ద రోడ్డుపై ఇసుకమేటలో కూరుకుపోయింది.

టూరిస్ట్ బస్సు ఇసుక మేటల నుంచి కదలటం లేదు. 30 మంది బస్సులోనే ఉన్నారు. భూపాలపల్లి జిల్లా మలహర్ మండలంలోని బొమ్మారం చెరువు వరద ఉద్ధృతిలో ఇద్దరు వ్యక్తులు చిక్కుకుపోయారు. వీరిని ఒడ్డుకు చేర్చేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ ఇరవై గొర్రెలు కూడా వీరితో పాటు వరద ఉద్ధృతిలో చిక్కుకున్నాయి. ఎగువ నుండి వరద పోటెత్తుతుండటంతో గోదావరి నది ప్రవాహం క్రమేణా పెరుగుతుంది. ఏకధాటి వానతో భూపాలపల్లి, ములుగుతో పాటు మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లోని చెరువుల్లోకి భారీగా వరద నీరు చేరుతుంది. దీంతో అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో గ్రామాల్లో తమ యంత్రాంగాన్నీ అలర్ట్ చేశారు. ఎక్కడికక్కడ సహాయక చర్యలు చేపడుతున్నారు. కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement