Friday, April 26, 2024

మావోయిస్టులూ లొంగిపోండి.. తెలంగాణ డీజీపీ సూచన

తెలుగు రాష్ట్రాలకు చెందిన మావోయిస్టులు జ‌నజీవ‌న స్ర‌వంతిలోకి రావాలని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి కోరారు. వారిని ప్ర‌భుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంద‌ని తెలిపారు. బుధవారం మావోయిస్టు కీలక నేత రావుల రంజిత్ అలియాస్ శ్రీకాంత్ డీజీపీ ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ క‌రోనాతో బాధ‌ప‌డుతున్న మావోయిస్టులు లొంగిపోతే.. ప్ర‌భుత్వ ప‌రంగా మెరుగైన వైద్యం అందిస్తామ‌న్నారు. సెంట్రల్ కమిటీ లో మొత్తం 25 మంది మావోయిస్టులు ఉన్నారని డీజీపీ తెలిపారు. తెలంగాణ రాష్టం నుండి 11 మంది, ఆంద్రప్రదేశ్ కి చెందిన మగ్గురు సెంట్రల్ కమిటీలో ఉన్నారన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న 14 మంది మావోయిస్టులు లొంగిపోవాలని కోరారు. లొంగిపోయిన మావోయిస్టు రంజిత్ కు 4 లక్షల పరిహారంతో పాటు ప్రస్తుత ఖర్చులకు 5 వేలు అందజేస్తున్నట్లు డీజీపీ వెల్లడించారు.

వ‌రంగ‌ల్ జిల్లా మ‌ద్దూరు మండ‌లానికి చెందిన రావుల శ్రీనివాస్ అలియాస్ రామ‌న్న‌, సావిత్రి దంప‌తుల కుమారుడు రావుల రంజిత్ అని తెలిపారు. రామ‌న్న‌, సావిత్రి ఇద్ద‌రూ మావోయిస్టులే. ఈ దంప‌తుల‌కు 1998లో రంజిత్ జ‌న్మించాడు. చిన్నప్పటి నుండి మావోయిస్టు కార్యకలాపాల్లో  చురుగ్గా వ్యవహరించాడని వివరించారు.1982లో మావోయిస్టు పీపుల్స్ వార్ లో రామన్న చేరాడని, 2019 లో గుండె పోటుతో రంజిత్ తండ్రి రామన్న చనిపోయాడని చెప్పారు. తండ్రి ఆధ్వర్యంలో రంజిత్ మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొన్నాడని చెప్పారు.

త‌న కుమారుడిని ఉన్న‌త చ‌దువులు చ‌దివించాల‌నే ఉద్దేశంతో రంజిత్‌ను ర‌హ‌స్యంగా ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కు చ‌దివించాడని తెలిపారు. మావోయిస్టు న‌గేశ్ స‌హ‌కారంతో నిజామాబాద్ జిల్లాలోని కాక‌తీయ స్కూల్లో చేర్పించారని, ప్ర‌తి స‌మ్మ‌ర్ వెకేష‌న్‌లో దండ‌కార‌ణ్యంలో ఉంటున్న తండ్రి రామ‌న్న వ‌ద్ద‌కు రంజిత్ వ‌చ్చేవాడన్నారు. 2015లో రంజిత్ ప‌దో త‌ర‌గ‌తి పూర్తి చేశాడని, ఆ స‌మ‌యంలోనే న‌గేశ్ చ‌నిపోయాడని తెలిపారు. దీంతో రంజిత్‌ను ఉన్న‌త విద్య చ‌దివించేందుకు పంప‌లేదన్నారు. త‌మ కార్య‌క‌లాపాలు బ‌య‌ట‌కు తెలుస్తాయ‌నే భ‌యంతో రంజిత్ చ‌దువును అక్క‌డితో ఆపేశాడని వివరించారు.

రంజిత్ 2015 నుంచి 2017 వ‌ర‌కు మావోయిస్టు పార్టీ కార్య‌క‌లాపాల్లో చురుకుగా ప‌ని చేశాడన్నారు. తండ్రి సూచ‌న‌ల మేర‌కు 2017లో మావోయిస్టు బెటాలియ‌న్‌లో రంజిత్ చేరాడని చెప్పారు. 2019లో తండ్రి రామ‌న్న తీవ్ర అనారోగ్యానికి గురై గుండెపోటుతో చ‌నిపోయాడని పేర్కొన్నారు. బ‌య‌ట‌కు తీసుకెళ్లి మెరుగైన వైద్యం చేపిద్దామ‌ని చెప్పినా కూడా పార్టీ రంజిత్ వాద‌న‌ను వినిపించుకోలేదన్నారు. తండ్రి మ‌ర‌ణానంత‌రం మావోయిస్టు కార్య‌క్ర‌మాల‌పై విర‌క్తి చెందిన రంజిత్ లొంగుబాటుకు అనుమ‌తి కోరాడని, కానీ మావోయిస్టు పార్టీ తిర‌స్క‌రించిందన్నారు. త‌న త‌ల్లి సావిత్రి అనుమ‌తితో రంజిత్ లొంగిపోయాడన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మావోయిస్టు పార్టీ నేతలు లొంగిపోవాలి డీజీపీ మహేందర్ రెడ్డి సూచించారు.

కోవిడ్ తో అనేక మంది మావోయిస్టులు చనిపోయారని రంజిత్ తెలిపాడు. హరిభూషన్, భారతక్క కరోనాతో చనిపోయారని వివరించారు. మావోయిస్టు పార్టీలో ఉన్న నేతలు అందరూ లొంగి పోవాలని రంజిత్ అప్పీల్ చేశాడు. మావోయిస్టు భావ‌జాలంతో ప్ర‌స్తుతం ఎలాంటి ఉప‌యోగం లేద‌ని రంజిత్ అభిప్రాయ‌ప‌డ్డాడు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement