Friday, April 26, 2024

సమ్మక్క సారలమ్మ జాతరకు ఘనంగా ఏర్పాట్లు

తెలంగాణలో అతిపెద్ద పండుగైన సమ్మక్క సారలమ్మ జాతరను రేకుర్తిలో నిర్వహించేందకు ఏర్పాట్లను ఘనంగా చేస్తామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. గురువారం రేకుర్తిలోని సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద మేయర్ వై. సునీల్ రావుతో కలిసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ గిరిజన ఆరాధ్య దేవతలైన సమ్మక్క సారలమ్మ దేవతల జాతరను మేడారంతో పాటు అన్ని జిల్లాల్లో ఘనంగా జరుపుకుంటారని అన్నారు. వచ్చేనెల 16వ తేదీ నుంచి రెకుర్తిలో నాలుగు రోజుల పాటు జరిగే జాతరకు అన్ని ఏర్పాట్లను చేస్తామని మంత్రి తెలిపారు. 1990 సంవత్సరం నుంచి రేకుర్తి లో సమ్మక్క సారలమ్మ జాతరను నిర్వహిస్తున్నారని చెప్పారు.

గత ఏడాది మూడున్నర లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకుని తరించారని మంత్రి తెలిపారు. ఈ ఏడాది సుమారు నాలుగు లక్షలకు పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని చెప్పారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు వీలుగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మునిసిపల్ గ్రాంటు నిధులు రూ.1.30 కోట్లతో టెండర్లు పిలిచి పూర్తి చేశామన్నారు. సమ్మక్క సారలమ్మ గద్దెల చుట్టూ సిసి రోడ్లు, లైటింగ్, బార్ కేడింగ్, మట్టి రోడ్డు పనులు, పార్కింగ్ స్థలాలు, సౌండ్ సిస్టం, క్యూ లైన్ బార్ కేడింగ్, దుస్తులు మార్చుకొనుటకు డ్రెస్సింగ్ రూమ్ లు, అంతర్గత లింకు రోడ్లు, కెనాలులో సిల్ట్ తొలగింపు తదితర పనులను పూర్తి చేసి భక్తులకు సౌకర్యవంతంగా తీర్చిదిద్దుతామని మంత్రి తెలిపారు.
సమ్మక్క సారలమ్మ గద్దెల సమీపంలో రాక్ కటింగ్ (బండరాళ్లను తొలిచి) చేయించి విశాలమైన మైదానాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. 24 గంటలపాటు త్రాగునీరు సౌకర్యం కల్పిస్తామని వైద్య బృందాలు, అగ్నిమాపక సిబ్బందిని, పోలీసు సిబ్బందిని, మున్సిపల్ సిబ్బందిని అందుబాటులో ఉంచి పారిశుద్ధ్యం మెరుగు పరుస్తామని తెలిపారు. జాతర ప్రారంభానికి పది రోజుల ముందు నుంచే మహిమగల అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తుల తాకిడి ప్రారంభమవుతుందని, జాతర తర్వాత కూడా భక్తులు అమ్మవారిని దర్శించుకునీ మొక్కులు తీర్చుకుంటారనీ, వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement