Saturday, April 27, 2024

ధరణి పోర్టల్‌ అద్భుతం..

మెదక్‌ : ధరణి పోర్టల్‌ను రాష్ట్ర ప్రభుత్వం అద్బుతంగా తీర్చిదిద్దిందని, దీని ద్వారా భూముల కొనుగోలు అమ్మకం సులభతరమైందని జిల్లా కలెక్టర్‌ యస్‌. హరీష్‌ అన్నారు. ధరణి ద్వారా వ్యవసాయ భూములకు భరోసా దొరికిందని వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ సమయంలో ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఎంకంబరేస్‌ సర్టిఫికేట్‌ను ధరణి పోర్టల్‌లో చూసుకొనే అవకాశముందని, ఎకరాకు 2,500 చొప్పున ఫీజు చెల్లిస్తే మ్యూటేషన్‌ పూర్తవుతుందని అన్నారు. కాగా ప్రస్తుతం ధరణిలో వస్తున్న అన్ని సమస్యలను జాగ్రత్తగా పరిశీలించి ఒక చిన్న తప్పు దొర్లకుండా త్వరితగతిన పరిష్కరించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. ధరణి పోర్టల్‌లో వచ్చిన వివిధ భూ సమస్యల గురించి కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో అన్ని మండలాల ఉప తహశీల్దార్లు, సీనియర్‌ అసిస్టెంట్లు, ధరణి ఆపరేటర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ మ్యూటేషన్‌ కోసం భూములు, ఆస్తుల హక్కుల మార్పిడి కోసం భూ యజమానులు మీ సేవలో చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి ఎందుకు పెండింగ్‌ పెట్టారో మూలాలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని, ఎలాంటి నిర్లక్ష్యం చేయరాదని అన్నారు. ధరణి పార్ట్‌-బిలో మ్యూటేషన్‌, సర్వేనెంబర్‌ మిస్సింగ్‌ రికార్డులను సవరించుటకు వచ్చిన అన్ని ఫిర్యాదులను శీఘ్రంగా పరిశీలించి పరిష్కరిస్తే అటు ప్రజలు ఆనంద పడడమే గాక ఇటు జిల్ల్లాకు మంచిపేరు వస్తుందని కాబట్టి ఈ మూడు నెలలు మరింత కస్టపడాలని, ఏ చిన్న తప్పు చేసినా చెడ్డపేరు వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఒకరు వెలెత్తి చూపకుండా పనిచేయాలని కోరారు. దరణిలో దరఖాస్తు చేసిన వారి పేరు పార్ట్‌ -బిలో ఎందుకు పెండింగ్‌ పెట్టారో కారణాలు తెలుసుకొని పరిష్కరించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ జి. రమేష్‌, తూప్రాన్‌, నర్సాపూర్‌ ఆర్‌డిఓలు శ్యాంప్రకాష్‌, రవీందర్‌రెడ్డి, అన్ని మండలాల ఉప తహశీల్దార్లు, సీనియర్‌ అసిస్టెంట్‌లు, ధరణి ఆపరేటర్లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement