Thursday, May 16, 2024

సీఎం కేసీఆర్ దూరదృష్టి… మండువేసవిలోనూ తగ్గని భూగర్భ జలాలు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: గడిచిన ఏడేళ్లలో తెలంగాణ వ్యాప్తంగా భూగర్బ జలమట్టం 4.5శాతం మేర పెరిగినట్లు భూగర్భ జలవనరుల శాఖ నిర్ధారించింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ కాకతీయ, కాళేశ్వరం తదితర సాగునీటి ప్రాజెక్టులు, ఎక్కడికక్కడ వాగులు, వంకలపై చెక్‌ డ్యాంల నిర్మాణం తదితర కార్యక్రమాలు ఫలితాలనిస్తున్నాయని సాగునీటిరంగ నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలోని 93శాతం గ్రామాలు భూగర్భజల వనరుల ప్రాతిపదికన చూస్తే తాగు, సాగునీటి విషయంలో సురక్షిత కేటగిరిలో ఉన్నాయి. 2015తో పోలిస్తే ఏడేళ్ల తర్వాత ఈ ఏడాది తెలంగాణలో 4.26 మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయి. గడిచిన దశాబ్దంతో పోలిస్తే భూగర్భ జలాల విస్తీర్ణం 106శాతం పెరిగింది.

అత్యంత లోతులో 27 మీటర్ల కంటే ఎక్కువ లోతులో భూగర్భ జలాలు ఉన్న విస్తీర్ణం 87శాతం మేర తగ్గిందని భూగర్భ జలవనరుల శాఖ గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రంలోని 83శాతం మండలాల్లో భూగర్భ జలాలు పెరిగాయి. సాగునీటిరంగంలో రాష్ట్ర ప్రభుత్వ చర్యలతోనే భూగర్భ జలాలు పెరిగినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. గడిచిన దశాబ్దకాలం కంటే ఈ సారి వేసవి ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లోనూ తెలంగాణలో భూగర్భ జల మట్టం పెరిగినట్లు భూగర్భ జల వనరుల శాఖ స్పష్టం చేసింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 2022 మే నెలలో 0.29 మీటర్ల మేర భూ గర్భ జల మట్టం పెరిగినట్లు నిర్ధారించింది. 33 జిల్లాలకు గాను 19 జిల్లాల్లో మే నెలలో భూ గర్భ జల మట్టం పెరిగింది. అత్యధికంగా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 3.97 మీటర్ల మేర భూ గర్భ జలాలు పెరిగాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement