Saturday, May 25, 2024

బీహార్‌లో వింత శిశువు.. నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో జననం

బీహార్‌లో ఓ మహిళ నాలుగు చేతులు, నాలుగు కాళ్లు ఉన్న శిశువుకు జన్మనిచ్చింది. బీహార్‌లోని కతిహార్ పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు. శిశువును చూసేందుకు ఆసుపత్రికి జనం ఎగబడుతున్నారు. శిశువుకు నాలుగు కాళ్లు, నాలుగు చేతులు ఉండడంతో వైద్యులు కూడా ఆశ్చర్యపోయారు.

ఇటీవల నొప్పులు రావడంతో ఆ మహిళ ఆసుపత్రికి వెళ్లింది. అక్కడి వైద్యులు సర్జరీ ద్వారా ఆమెకు డెలివరీ చేశారు. ఈ క్రమంలో నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో కూడిన శిశువు జన్మించింది. జన్యు లోపం వల్లే శిశువు ఇలా జన్మించిందని వైద్యులు వెల్లడించారు. నిజానికి ఆమె గర్భంలో కవలలు ఉన్నారని… అయితే సరైన ఎదుగుదల లేకపోవడం వల్ల ఈ లోపం తలెత్తిందని తెలిపారు.

అయితే, వైద్య చికిత్సలో లోపం వల్లే ఇలా జరిగిందని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గర్భంతో ఉండగా తీసిన అల్ట్రాసౌండ్ స్కానింగ్ లో ఈ విషయం ఎప్పుడూ బయటపడలేదన్నారు. ఇది ముమ్మాటికీ వైద్యుల నిర్లక్ష్యమేనని అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement