Friday, May 31, 2024

TG | తొలిసారి క‌మాండ్ కంట్రోల్ సెంటర్కు సీఎం రేవంత్..

హైదరాబాద్ బంజారాహిల్స్ లోని మెయిన్ కమాండ్ కంట్రోల్ సెంటర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చారు. సీఎం అయిన తరువాత తొలిసారి కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కార్యాలయానికి చేరుకోగానే సీఎం రేవంత్ రెడ్డికి సీఎస్ శాంతకుమారి, తెలంగాణ డీజీపీ రవి గుప్తా, హైదరాబాద్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి పలువురు ఉన్నతధికారులు స్వాగతం పలికారు.

అనంతరం సైబర్ సెక్యూరిటీ వింగ్, డ్రగ్స్ కంట్రోల్ వింగ్ సెంటర్లను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. కమాండ్ కంట్రోల్‌లోని అధికారులు విధులు తదితర అంశాలపై సమీక్షిస్తున్నారు. నార్కోటిక్స్ బ్యూరో పనితీరుపై ఆరా తీసిన సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణలో డ్రగ్స్ అనే పదం వినిపించకూడదని ఆదేశించారు. నార్కోటిక్స్ బ్యూరోకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించి డ్రగ్స్ అరికట్టాలని ఉన్నతాధికారులను ఇప్పటికే ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి.. డ్రగ్స్ అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని, లేకుంటే యువతపై డ్రగ్స్, నార్కోటిక్స్ తీవ్ర ప్రభావం చూపుతాయని మరోసారి చెప్పారు. .

రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షిస్తున్నారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తుపదార్థాలు అరికట్టడంతో పాటు అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో గుర్తించి చర్యలు తీసుకోవడంపై చర్చించారు. ఇటీవల బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. టాలీవుడ్ సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలు ఆ పార్టీలో డ్రగ్స్ వినియోగించారని బెంగళూరు పోలీసులు ప్రకటించడంతో ఈ సమీక్షపై ఉత్కంఠ నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement