Saturday, April 27, 2024

ప్రజల దగ్గరికి.. ప్రజా నాయకుడు..ఈటల దారెటు ?

భూ కబ్జా ఆరోపణలతో మంత్రి పదవి కోల్పోయిన ఈటెల రాజేందర్‌ తదుపరి కార్యచరణ ఏమిటి? అన్నది రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. టీఆర్‌ఎస్‌ను వీడే ఆలోచనలో ఉన్న ఈటల.. ఆచితూచి అడుగులు వేస్తున్నారు. తన వెంట కలిసొచ్చే నేతలతో సమాలోచనలు చేస్తున్నారు. ప్రధానంగా తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నేతలు ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు. వీరిలో కొందరు ఈటలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీసీ సంక్షేమ సంఘం, బీసీ కులాల ఐక్యవేదిక, ఎమ్మార్పీఎస్‌, సగర కులసంఘం, లంబాడి ఐక్యవేదిక, ముదిరాజ్‌ సంఘాలతో పాటు ఇతర సంఘాల నేతలు ఈటలను కలిసి తమ మద్దతు ప్రకటించారు. మరోవైపు తన నియోజకవర్గం హుజురాబాద్‌లోనూ ఈటల సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే హుజురాబాద్ కు చేరుకున్న ఈటల.. తన ముఖ్య అనుచరులతో కీలక భేటీ నిర్వహిస్తున్నారు.  రాష్ట్రంలో 93 శాతంగా ఉన్న దళిత, బహుజనుల కోసం పార్టీ స్థాపించాలని ఈటల రాజేందర్‌ను ఓయూ దళిత బహుజన విద్యార్థులు కోరారు. ఇటీవల ఆయన ఇంటికి వెళ్లిన విద్యార్థులు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయనకు స్పష్టం చేశారు.

ఈటల రాజేందర్‌ భార్య జమున పేరిట ఉన్న హ్యాచరీస్‌ కోసం అసైన్డ్‌ భూములను కబ్జా చేశారని ఆరోపణలపై ఈటలను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేశారు. ఈటల కబ్జా చేశారని ప్రభుత్వానికి నివేదిక వెళ్లడం, ఆ వెంటనే ఈటలను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని కేసీఆర్‌ నిర్ణయం తీసుకోవడం, ఆ వెంటనే రాజ్‌‌భవన్ నుంచి ఉత్తర్వులు వెలువడటం చకచకా జరిగిపోయాయి. దీంతో ఈటల రాజకీయ భవిష్యత్తుపై తీవ్రస్థాయిలో చర్చ నడుస్తోంది.  మొదటి నుంచీ కేసీఆర్‌కు సన్నిహితంగా ఉన్న ఈటలకు 2014లో తెలంగాణ ఆవిర్భవించి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కీలకమైన ఆర్థిక మంత్రిత్వశాఖ లభించింది. మొదట రెండు మూడు సంవత్సరాల వరకు బాగానే ఉన్నా సీఎం కేసీఆర్ కు ఈటలకు మధ్య దూరం బాగా పెరిగినట్లు అప్పట్లో ప్రచారం బాగా జరిగింది. 2018లో శాసనసభ ఎన్నికల్లో రెండోసారి టీఆర్ఎస్ గెలిచిన తర్వాత ఈటలకు వైద్యారోగ్య శాఖ కేటాయించారు. అయితే, ప్రస్తుతం సీన్ పూర్తిగా మారింది. కేసీఆర్ కు ఇప్పుడు ఈటల శత్రువుగా మారారు. టీఆర్ఎస్ కు రాజీనామా చేసి ఇరత పార్టీల్లో చేరుతా? లేక కొత్త పార్టీ పెడుతారా? అన్నది సస్పెన్స్ గా మారింది.

మరోవైపు టీఆర్ఎస్ ను వీడేందుకు సిద్ధమైన ఈటల.. సీఎం కేసీఆర్ పైనా సంచలన వ్యాఖ్యలు చేశారు. భూకబ్జా పేరుతో అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధం లేని భూములను తనకు అంటగడుతున్నారని ఆరోపించారు.  అధికారులు సమర్పించిన నివేదికలో అన్నీ తప్పులే ఉన్నాయన్నారు. ప్రభుత్వంలో ఒక కమిట్‌ మెంట్‌ తో పనిచేశానన్న ఈటల.. ఎప్పుడూ చిల్లర పనులు చేయలేదని చెప్పుకొచ్చారు. సుదీర్ఘకాలంగా సీఎం కేసీఆర్‌తో కలిసి పనిచేశానని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. కేసీఆర్‌తో కలిసి పని చేసినంత కాలం ఒక్కపైసా కూడా సంపాదించలేదని స్పష్టం చేశారు. 2008లో పార్టీ ఆదేశిస్తే రాజీనామా చేశానని, పార్టీలో ఏ బాధ్యత అప్పగించినా నిర్వర్తించానని పేర్కొన్నారు. పార్టీకి నష్టం చేకూర్చే పని ఏనాడు చేయలేదన్నారు. గత మూడ్రోజులుగా తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. పథకం ప్రకారమే తనపై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తనలాంటి సామాన్యుడిపై కేసీఆర్ అధికారాన్నంతా ఉపయోగించారని వ్యాఖ్యానించారు.

గులాబీ కండువా వేసుకున్న ప్రతి కార్యకర్తకు.. పార్టీకి ఓనర్ అనే ఫీలింగే ఉంటుందని ఈటల రాజేందర్ పునరుద్ఘాటించారు. పార్టీ భీఫామ్ ఉంటే కాదని, ప్రజల ఆమోదం ఉంటేనే గెలుస్తారని వ్యాఖ్యానించారు. తనకు అన్యాయం జరిగిందన్న భావన ప్రజల్లో ఉందన్న ఈటల.. కొత్త పార్టీ పెట్టే ఆలోచన ఏమాత్రం లేదని తేల్చి చెప్పారు. నియోజకవర్గ ప్రజలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తానని స్పష్టం చేశారు. ఈ  నేపథ్యంలో ఈటల రాజకీయ భవిష్యత్తు ఏమిటనేది ప్రస్తుతం రజాకీయ వర్గాల్లో, రాజకీయ విశ్లేషకుల్లో చర్చనీయాంశంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement