Friday, April 26, 2024

వాచ్‌ మెన్‌గా మారిన సర్పంచ్!

ప్రజలు ఓట్లు వేసి గెలుచుకున్న ఓ సర్పంచ్ వాచ్‌ మెన్‌గా మారాడు. ఓ వైపు కుటుంబ భారం.. మరోవైపు గ్రామ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. చేసిన పనులకు సర్కారు బిల్లులు ఇవ్వకపోవడంతో ఓ సర్పంచ్​ సెక్యూరిటీ గార్డుగా మారాడు. ఉదయం సర్పంచ్‌గా రాత్రిపూట వాచ్‌మెన్‌గా మారిన దీన స్థితి తెలంగాణలో వెలుగు చూసింది. దళిత బంధు కోసం వేల కోట్లు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం.. ఆదే ఎస్సీ వర్గానికి చెందిన సెక్యూరిటీ గార్డుగా మారాడు.

నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం ఆరెపల్లి గ్రామంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఇరుసు మల్లెష్‌.. ఆరెప‌ల్లి గ్రామం సర్పంచ్‌గా ఎంపికయ్యాడు. గ్రామపంచాయతీ ఎస్సీ రిజర్వ్ అవ్వడంతో.. సర్పంచ్ పదవికి ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో లక్కీడిప్​ ద్వారా ఇరుసు మల్లేష్ ​ను 2019లో సర్పంచ్ గా ఎన్నుకున్నారు.

సర్పంచ్‌గా ఎన్నికైన తర్వాత గ్రామంలో పలు అభివృద్ది పనులకు చేపట్టారు. అయితే ఆ పనులను తానే స్వయంగా చేయడంతో అప్పుల పాలు అయ్యాడు. పల్లె ప్రగతితో పాటు గ్రామంలో చేసిన పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు అలాగే ఉండిపోయాయి. గ్రామాభివృద్ధిలో భాగంగా ​​ వైకుంఠధామం నిర్మాణానికి, పల్లెప్రగతిలో పారిశుధ్య పనులకు సొంత నిధులు వెచ్చించారు. ఇందుకోసం రూ. 3.1 లక్షల వరకు అప్పు చేశారు. ప్రభుత్వం ఎంతకీ బిల్లులు మంజూరు చేయకపోవడం, మరోవైపు వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక మల్లేష్ తన రెండెకరాల్లో అర ఎకరం పొలం అమ్మి రూ.2.5 లక్షల అప్పులు తీర్చాడు.

మరోవైపు సర్పంచ్‌లకు ఇచ్చే గౌరవ వేతనం కూడా నెలవారిగా అందని పరిస్థితి నెలకొంది. సర్పంచ్​గౌరవ వేతనం రూ.5 వేలు కూడా సకాలంలో ఇవ్వడం లేదు. దీంతో పూట గడవడమే గగనమయింది. దీంతో ఇళ్లు గడవడం కూడా ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలోనే వాచ్ మెన్ గా మారాడు. పార్ట్ ​టైమ్​గా రూ.8 వేల జీతానికి రాత్రివేళ నిజామాబాద్​ జిల్లా కేంద్రంలోని అపార్ట్​మెంట్​లో సెక్యూరిటీ గార్డ్​ గా నైటీ డ్యూటీ చేస్తున్నారు. రాత్రి పూట వాచ్‌ మెన్ విధులు నిర్వహిస్తూ.. పగటిపుట సర్పంచ్ పనుల్లో నిమగ్నమవుతున్నాడు. ఇలా గ్రామంలో ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులతో పాటు ఇతర అవసరాలను చూస్తున్నాడు.

- Advertisement -

మొత్తం గ్రామ జనాభా 434 మంది ఉంగా.. గ్రామ పంచాయతీకి స్టేట్​ ఫైనాన్స్ ​కమిషన్ ​నుంచి జనాభా ప్రాతిపాదికన నెలకు రూ.37 వేలు వస్తాయి. అయితే ఈ నిధులు పంచాయతీ కరెంట్​చార్జీలు, సిబ్బంది జీతాలకే సరిపోతున్నాయి. ఇక చేసిన అభివృద్ది పనులకు బిల్లులు రావడం గగనం అవుతుందని సర్పంచ్ మల్లేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. బిల్లులకు సంబంధించి జిల్లా కలెక్టర్‌తో పాటు రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ కూడా పరిస్థితి వివరించినా.. ఫలితం మాత్రం శూన్యం అని పేర్కొన్నాడు.

ఇది కూడా చదవండిః వైరల్ అయిన ఆడియోపై మంత్రి అవంతి వివరణ

Advertisement

తాజా వార్తలు

Advertisement