Sunday, April 28, 2024

తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా రావుల చంద్రశేఖర్‌రెడ్డి?

తెలంగాణ టీడీపీ చీఫ్ ఎల్.రమణ పార్టీ ఫిరాయించడంతో ఇప్పుడు కొత్త బాస్ ఎవరన్న అంశంపై టీడీపీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. టీడీపీ చీఫ్ పదవి సీనియర్ నేతకు ఇవ్వాలా..? లేక దూకుడుగా ఉండే నేతకు అప్పగించాలా..? అని చంద్రబాబు తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో పార్టీ నిలబడాలంటే దూకుడు స్వభావం ఉన్న నేతకు టీడీపీ చీఫ్ పదవి ఇవ్వాలని కొందరు నేతలు భావిస్తుండగా.. సీనియర్ నేతకు ఇస్తే పార్టీ బలోపేతం అవుతుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. దీనిపై రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

అయితే చంద్రబాబు పార్టీ సీనియర్ నేతకు పదవి ఇవ్వాలని భావిస్తే రావుల చంద్రశేఖర్‌రెడ్డికి ఆ అవకాశం లభించనున్నట్లు సమాచారం. ఇటీవల పార్టీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులతో చంద్రబాబు వర్చువల్ సమావేశాలు జరిపి అభిప్రాయాలు సేకరించారు. మెజార్టీ నేతలు రావుల చంద్రశేఖర్ రెడ్డి పేరు సూచించినట్లు సమాచారం. రావుల చంద్రశేఖర్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన నేత. 1982లో కానాయపల్లి సర్పంచ్‌ రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. తర్వాత టీడీపీ జిల్లా కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, రాజ్యసభ సభ్యుడు.. ఇలా అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. వివాదరహితుడనే పేరు కూడా ఉంది. దీంతో చాలామంది నేతలు ఆయన పేరును చంద్రబాబుకు సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది.

ఈ వార్త కూడా చదవండి: ఎల్.రమణ కారెక్కేది ఎప్పుడంటే?

Advertisement

తాజా వార్తలు

Advertisement