Saturday, April 27, 2024

Delhi: టీఎస్ ఐపాస్‌తో టూరిజంలో పురోగతి.. కొవిడ్ తర్వాత తెలంగాణలో పెరిగిన ఆదాయం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణలో అమలుచేస్తున్న టీఎస్ ఐపాస్ సింగిల్ విండో విధానంతో పర్యాటక రంగంలో పురోగతి కనిపిస్తోందని రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ ఎండీ మనోహర్ సంతోషం వ్యక్తం చేశారు. మూడు రోజులుగా హిమాచల్ ప్రదేశ్ లోని ధరంశాలలో జరుగుతున్న పర్యాటక మంత్రుల జాతీయ సదస్సులో టూరిజం రంగంలో డిజిటల్ టెక్నాలజీ వాడకంపై మంగళవారం ఆయన ప్రసంగించారు. అనంతరం మనోహర్ ఆంధ్రప్రభతో సదస్సులో ప్రసంగించిన విషయాలను పంచుకున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు నూతన విధానాలు, చర్యల వల్ల కోవిడ్ తర్వాత పర్యాటక రంగ ఆదాయం 30 శాతం పెరిగిందని వెల్లడించారు. ఐటీ రంగంలో ముందున్న తెలంగాణ రాష్ట్రం టెక్నాలజీని ఉపయోగించి పర్యాటకాన్ని ప్రమోట్ చేస్తోందని చెప్పారు. ప్రపంచవ్యాప్త జనాభాలో 7.5 శాతం మంది ఇంటర్నెట్ వాడుతున్నారని, రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల గురించి ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టాల్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ల ద్వారా మార్కెటింగ్ చేస్తున్నామని చెప్పారు.

గతంలో పర్యాటక ప్రాంతాల గురించి చెప్పాలంటే పేపర్లలోనో, టీవీలలోనో డబ్బులు ఖర్చు పెట్టి మరీ ప్రకటనలు ఇవ్వాల్సి వచ్చేదని, ఇప్పుడా అవసరం లేకుండానే సోషల్ మీడియా ద్వారా అన్ని విషయాలూ తెలుసుకునే అవకాశముందన్నారు. గతంలో టూరిస్టులకు ఛాయిస్ ఉండేది కాదన్న ఆయన, ఇప్పుడు డిజిటల్ టెక్నాలజీ వాడకంతో పని సులభం అవుతోందన్నారు. టీఎస్ ఐపాస్ వల్ల అన్ని రకాల సర్టిఫికెట్లు సింగిల్ విండో ద్వారా ఇంటికే అందజేయగలుగుతున్నామని మనోహర్ హర్షం వ్యక్తం చేశారు.

టూరిస్టులు, అధికారులకు డిజిటల్ టెక్నాలజీ ఎంతో సౌకర్యవంతంగా వుంటోందన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులు, చేసిన పనులు, ఖర్చు పెడుతున్న తీరు, జరుగుతున్న అభివృద్ధి వంటి వాటిని కేంద్ర పర్యాటక శాఖకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నామని ఆయన తెలిపారు. తెలంగాణలో అమలు చేస్తున్న విధానాలను ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సదస్సులో మంత్రులకు సూచించారని మనోహర్ చెప్పారు.

- Advertisement -

కోవిడ్ తర్వాత విదేశీ పర్యాటకుల సంఖ్య తగ్గడంతో దేశీయ టూరిస్టులపై శ్రద్ధ పెట్టి చేపట్టిన కార్యక్రమాలు సత్పలితాలను ఇచ్చాయని వివరించారు. పట్టణాలకు సమీపంలో ఉన్న చెరువులు, సరస్సులు, రిజర్వాయర్లను సుందరీకరించడం వల్ల స్థానిక పర్యాటకుల సంఖ్య పెరిగి రాష్ట్రానికి పర్యాటక ఆదాయం పెరిగిందని మనోహర్ చెప్పుకొచ్చారు.  స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగాయయన్నారు.

పల్లెల్లో ఉన్న వారు కూడా పర్యాటక ప్రాంతాలకు వెళ్ళడానికి ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. టూరిజం రంగంలో ఉత్తమ సేవలందిస్తూ ఇతర రాష్ట్రాలతో పోటీ పడుతూ తెలంగాణ ముందుకెళ్తోందని మనోహర్ నొక్కి చెప్పారు. పర్యాటక రంగాభివృద్ధికి ఏయే రాష్ట్రాలు ఎలాంటి విధానాలను అమలు చేస్తున్నాయి, వాటిని ఇతర రాష్ట్రాల్లో ఎలా వినియోగించవచ్చు వంటి అంశాలపై సదస్సులో చర్చించామన్న ఆయన, ఇలాంటి ఉపయోగకరమైన వర్క్ షాపును నిర్వహించినందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement