Monday, May 6, 2024

పంచాయితీలను పక్కన పెట్టి కలిసి పనిచేయాలి, సోనియా, రాహుల్‌ నాయకత్వానికి టీపీసీసీ మద్దతు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : పంజాబ్‌లో కాంగ్రెస్‌ ఓటమితో రాష్ట్ర కాంగ్రెస్‌ చాలా నేర్చుకోవాల్సి ఉందని టీ పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీగౌడ్‌ అన్నారు. రాష్ట్ర నాయకుల మధ్య నెలకొన్న గొడవవలను పక్కన పెట్టి.. కలిసికట్టుగా పని చేయాల్సిన అవసరం ఉందని, అప్పుడే టీఆర్‌ఎస్‌ను గద్దె దింపుతామని ఆయన పేర్కొన్నారు. శనివారం గాంధీభవన్‌లో టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అధ్యక్షతన టీ పీసీసీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీగౌడ్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్స్‌ గీతారెడ్డి, మహేష్‌కుమార్‌గౌడ్‌, అంజన్‌కుమార్‌యాదవ్‌తో పాటు సీనియర్‌ ఉపాధ్యక్షులు తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఐదు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల ఫలితాలు, కేసీఆర్‌ ప్రకటించిన ఉద్యోగ ఖాళీల అంశం, కొల్లాపూర్‌లో నిర్వహించే మన ఊరు- మనపోరు సభ, డిజిటల్‌ మెంబర్షిప్‌ తదితర అంశాలపై చర్చించారు. సోనియా, రాహుల్‌ గాంధీల నాయకత్వానికి మద్దతుగా టీ పీసీసీ తీర్మానం చేసింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్‌ నిరుత్సాహం పడకూడదన్నారు. టీ పీసీసీ కార్యవర్గ సమావేశం అనంతరం మధుయాష్కీగౌడ్‌ మీడియాతో మాట్లాడారు.

2004లో జరిగిన సార్వత్రిక ఎన్నిలకు ముందు కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి దేశ వ్యాప్తంగా ఇబ్బంది కరంగా ఉన్నదని, కేవలం రెండు రాష్ట్రాల్లోనే అధికారంలో ఉందని మధుయాష్కీ వివరించారు. సోనియాగాంధీ పార్టీ బాధ్యతలు తీసుకున్న తర్వాతనే కేంద్రంలో వరసగా రెండు పర్యాయాలు, ఏపీతో పాటు అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆయన తెలిపారు. సోనియా, రాహుల్‌, ప్రియాంక గాంధీలు బలహీనులు అయితే ప్రధాన మంత్రి నరేంద్రమోడీ పదే పదే గాంధీ కుటుంబం గురించి మాట్లాడుతున్నారని ఆయన నిలదీశారు. ఉత్తరాఖండ్‌, గోవాలో కాంగ్రెస్‌ గెలుపును టీఎంసీ లాంటి పార్టీలు దెబ్బతీశాయని విమర్శించారు. ఉత్తరాఖండ్‌లో బీజేపీ విజయం కోసం కేసీఆర్‌ కృషి చేశారని మధుయాష్కీ వివరించారు. మోడీ ప్రొడక్షన్‌, ప్రశాంత్‌ కిషోర్‌ దర్శకత్వంలో కేసీఆర్‌ నటిస్తున్నారని, ఎంఐఎం పార్టీ బీజేపీకి బీ టీమ్‌గా పని చేస్తోందని ఆయన విమర్శించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఆదివారం జరిగే సీడబ్ల్యూసీ సమావేశంలో చర్చిస్తారని తెలిపారు. రాహుల్‌గాంధీపై కుట్రపూరితంగా దుష్ఫచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మోడి, అమిత్‌షాలు పవర్‌ కోసమే పని చేస్తున్నారని విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement