Wednesday, May 8, 2024

ఆప్షన్‌ ఇవ్వాలి, కొత్త జిల్లాలకు బదలాయింపుపై ప్రభుత్వం చర్చించాలి: ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌

అమరావతి, ఆంధ్రప్రభ: కొత్త జిల్లాలకు ఉద్యోగుల బదలాయింపునకు ముందు ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపాలని ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది. కొత్త జిల్లాల నిర్ణయం స్వాగతించదగినదే అయినప్పటికీ ఎప్పుడో బ్రిటీష్‌ కాలం నాటి కేడర్‌ స్ట్రెంగ్త్‌తోనే ఇప్పటికీ ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు.. దీనివల్ల అదనపు పనిభారం పడుతోంది.. ఉద్యోగులకు ఎలాంటి నష్టం జరక్కుండా విభజన ప్రక్రియ నిర్వహించాలని విజ్ఞప్తి చేసింది. శనివారం విజయవాడలోని అసోసియేషన్‌ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏపీఆర్‌ఎస్‌ఏ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఉద్యోగుల విభజన, కేటాయింపులపై నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చించాలన్నారు. దశాబ్దాల క్రితం జనాభా ప్రాతిపదికన ఉద్యోగులకు విధులు కేటాయించారని అయితే ప్రస్తుతం అంతకు రెట్టింపు జనాభాకు సేవలందిస్తున్నారని తెలిపారు. ప్రస్తుత జనాభాను దృష్టిలో ఉంచుకుని రెవెన్యూ శాఖలో జిల్లా కలెక్టరేట్‌, డివిజన్‌, మండల స్థాయితో పాటు సీసీఎల్‌ఏ కార్యాలయంలో బ్రిటీష్‌ నాటి ఉద్యోగుల కేడర్‌నే పాత, కొత్త జిల్లాలకు కేటాయిస్తామని ప్రభుత్వం ప్రకటించటం విడ్డూరంగా ఉందన్నారు.

గతంలో జిల్లాలన్నింటికీ పెద్ద, చిన్న వ్యత్యాసం లేకుండా ఉద్యోగులను బదలాయించారని వివరించారు. అత్యధికంగా 67 మండలాలు ఉన్న అనంతపురం జిల్లాతోపాటు 34 మండలాలు కలిగిన విజయనగరం జిల్లాలో ఒకే రకమైన విధానాన్ని అవలంబించారని అుప్పుడులేని ఇబ్బందులు ఇప్పుడెలా వస్తాయని ప్రశ్నించారు. రెవెన్యూ శాఖలో ఉద్యోగులపై పనిభారం మరింత పెరిగిందని పునర్విభజన నేపథ్యంలో ఉన్న సిబ్బందిని పాత జిల్లాలో తగ్గించి వారిని కొత్త జిల్లాలకు బదలాయించటం వల్ల ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి గురవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. కలెక్టరేట్‌, డివిజన్‌ కార్యలయాల్లో పాత పద్దతిలోనే ఉద్యోగుల సంఖ్యను కొనసాగించాలని కోరారు. ఉద్యోగుల విభజన సమయంలో కొత్త జిల్లాలకు బదలాయించే ముందు ఆప్షన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆప్షన్‌ పూర్తయిన రువాత అవసరమైతే రివర్స్‌ సీనియారిటీ విధానాన్ని అమలు చేయాలని ప్రతిపాదించారు. గత కొన్ని సంవత్సరాలుగా ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఉన్నందున ప్రధానంగా రెవెన్యూ శాఖలో కొందరు రాజకీయ, అధికార, ఉద్యోగుల ఒత్తిడి మేరకు వివిధ ప్రాంతాలకు డిప్యూటేషన్లపై అనధికారికంగా బదిలీలు చేస్తున్నారని, బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేసి వారి ఆప్షన్‌ మేరకు జిల్లాల్లో సర్దుబాటు చేసిన తరువాతే కొత్త జిల్లాలకు ఉద్యోగుల బదలాయింపు చేపట్టాలన్నారు.

స్పౌజ్‌, వితంతు, అనారోగ్య పరిస్థితులు, ఒంటరి మహిళలు, వికలాంగ ఉద్యోగుల విషయంలో బదిలీలపై నిషేధం ఎత్తివేసి సర్దుబాట్లు చేసిన తరువాతే వర్క్‌ టు ఆర్డర్స్‌ను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. మీ సేవ, గ్రామ, వార్డు సచివాలయాల్లో నమోదవుతున్న రెవెన్యూ సర్వీసెస్‌ యూజర్‌ చార్జీల్లో వాటా విడుదల చేయటంలేదని ఫర్నీచర్‌, ఇతర సామాగ్రికి బిల్లులు చెల్లించే పరిస్థితులు లేవన్నారు. కోర్టు కేసుల్లో ప్రతివాదుల తరుపున రూ. 15 వేల చొప్పున సంబంధిత తహసీల్దార్లు చెల్లిస్తున్నారని రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న కేసులపై స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి లీగల్‌ చార్జిలు విడుదల చేయటంతో పాటు నిర్వహణకు ప్రత్యేక నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరుతూ సమావేశం తీర్మానించింది. తహసీల్దార్‌ కార్యాలయాల విద్యుత్‌ బాయిలను మాఫీ చేయాలని, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడే క్రమంలో ఉద్యోగులపై సివిల్‌, క్రిమినల్‌ కేసులు నమోదవుతున్నాయని జిల్లా స్థాయిలో రెవెన్యూ, పోలీస్‌ శాఖ సమన్వయంతో స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌తో టాస్క్‌ ఫోర్స్‌ ఏర్పాటుచేసి ప్రభుత్వ భూములు పరాధీనం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సమావేశంలో అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి చేబ్రోలు కృష్ణమూర్తి, సహ అధ్యక్షుడు పితాని త్రినాధరావు, ఉపాధ్యక్షులు జి సుశీల, శ్రీరామ్మూర్తి, కేఎస్‌ శర్మ, పీ వేణుగోపాలరావు, కోశాధికారి వి గిరికుమార్‌ రెడ్డి, సీహెచ్‌ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement