Saturday, May 18, 2024

బడ్జెట్‌లో వ్యవసాయ విద్యుత్‌కు పెద్దపీట, సబ్సిడీ విద్యుత్‌కూ భారీగా నిధులు

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్ర బడ్జెట్‌లో విద్యుత్‌ రంగ సబ్సిడీలకు పెద్దపీట వేశారు. అందులోనూ రైతులకే అగ్రస్థానం దక్కేలా రూపొందించారు. ఒక్క వ్యవసాయ ఉచిత విద్యుత్‌కే రూ. 5 వేలకోట్లు బడ్జెట్‌లో కేటాయించారు. ఆక్వా రంగానికి అందించే సబ్సిడీ విద్యుత్‌ రూ. 500 కోట్లుగా ప్రకటించారు. వీటితో కలిపి ఇంధన శాఖకు మొత్తం రూ. 10,281 కోట్లు కేటాయించారు. గత ఏడాది కేటాయింపుల కంటే ఇది దాదాపు 3.5 వేల కోట్లు అధికంగా ఉంది. ముఖ్యంగా వ్యవసాయ రంగ అనుబంధ రంగాలకు సబ్సిడీ అందించడంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా రైతులను పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా ఇప్పటికే కార్యాచరణ రూపొందించిన ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో ఆ దిశగా అడుగులు వేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ముందుగా 5 వేల పైచిలుకు జనాభా ఉన్న గ్రామాలకు 3 ఫేజ్‌ విద్యుత్‌ సరఫరా అందించే కార్యక్రమానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. ఇప్పటికే ఈ కార్యక్రమం గత ఏడాది బడ్జెట్‌లో కేటాయించిన నిధులతో నిర్విరామంగా కొనసాగుతుండగా, ఇప్పుడది మరింత వేగాన్ని పుంజుకోనుంది. ఈకార్యక్రమం పూర్తయిన వెంటనే 5 వేల కంటే తక్కువ ఉన్న గ్రామాల్లో కూడా 3 ఫేజ్‌ విద్యుత్‌ సరఫరాను అందించే కార్యక్రమం మొదలుకానుంది. ఇది అనుకున్నట్లుగా పూర్తయితే గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామికవేత్తలు వెలుగులోకి రానున్నారు. అయితే, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లకు కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సాహం ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో పండించే వ్యవసాయ ఉత్పత్తులతోనే రైతులు పారిశ్రామిక వేత్తలుగా తయారయ్యేందుకు ఈ 3 ఫేజ్‌ విద్యుత్‌ సరఫరా ఎంతగానో దోహదపడనుంది. ఇది పల్లెల్లోని ప్రజల ఆర్ధిక స్థితిగతులను మరింతగా మెరుగుపరుస్తుందని ప్రభుత్వం ధృఢంగా నమ్ముతోంది.

30 ఏళ్లు వ్యవసాయ విద్యుత్‌..

వ్యవసాయ ఉచిత విద్యుత్‌ కోసం రూ. 5 వేల కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు వ్యవసాయ బడ్జెట్‌ ప్రసంగంలో తెలిపారు. పగటిపూట తొమ్మిది గంటల విద్యుత్‌ సరఫరాకు సెకీ నుండి 7 వేల మెగావాట్ల విద్యుత్‌ కొనుగోలుకు ఒప్పందం ఏఉకున్నామన్నారు. వచ్చే 30 ఏళ్లపాటు వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్‌ అందించనున్నట్లు చెప్పారు. ఆక్వా రంగానికి విద్యుత్‌ను యూనిట్‌కు రూ. 150కే ప్రభుత్వం సరఫరాచేస్తోందన్నారు. గత ప్రభుత్వ వ్యవసాయ విద్యుత్‌ సబ్సిడీ బకాయిల కోసం రూ. 8,500 కోట్లు తమ ప్రభుత్వం ఇచ్చిందని, దీనితో కలిపి ఇప్పటివరకూ విద్యుత్‌కోసం మొత్తం రూ. 36,630 కోట్లు చెల్లించిందని మంత్రి వివరించారు.

ఎస్సీ, ఎస్టీల గృహ విద్యుత్‌కు రాయితీ..

రాష్ట్రంలో దాదాపు 21 లక్షల మంది షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగల గృహ వినియోగదారులకు నెలకు 200 యూనిట్ల వరకూ విద్యుత్‌ రాయితీ అందిస్తున్నామని ఆర్ధిక శాఖా మంత్రి తెలిపారు. ధోభీ ఘాట్‌లకు, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న రజక సంఘాలకు, అనేక వెనుకబడిన కుల సంఘాలకు, చేనేత కార్మికులకు, క్షౌర శబుూలలకు, బంగారుకవరింగ్‌ యూనిట్లకు, ఇమిటేషన్‌ జ్యూవెలరీ యూనిట్లకు రాయితీ విద్యుత్‌ను అందిస్తున్నట్లు వివరించారు. భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని ట్రాన్స్‌ఫార్మర్లు, ఫీడర్లకు మీటర్లు అందిస్తామని తెలిపారు. దీనివలన అన్ని గ్రామీణ ప్రాంతాలకు 24 గంటల 3 ఫేజ్‌ విద్యుత్‌ అందుతుందని, పారిశ్రామిక అభివృద్ధికి దోహదం చేస్తుందని తెలిపారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement