Saturday, May 4, 2024

అటు దేశంలో.. ఇటు రాష్ట్రంలో కరోనా పంజా

దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ కలవరపెడుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 10.25 లక్షల మందికి కరోనా పరీక్షలు చేయగా 47,262 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,17,34,058కి చేరింది. కరోనా సెకండ్ వేవ్‌లో మంగళవారం నాడు రికార్డు స్థాయిలో 275 మంది కరోనాతో మరణించారు. దీంతో ఇప్పటివరకు మొత్తం మరణాల సంఖ్య 1,60,441కి చేరింది. కొత్తగా 23,907 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1,12,06,160గా నమోదైంది. అటు గడిచిన 24 గంటల్లో 23.46 లక్షల మందికి టీకాలు వేశారు. ఇప్పటివరకు దేశంలో 5.08 కోట్ల మందికి టీకాలు అందినట్లు కేంద్రం ప్రకటించింది.

తెలంగాణలో ఈ ఏడాది ఇవే అత్యధికం
అటు తెలంగాణలోనూ కరోనా పాజిటివ్ కేసులు భారీగానే పెరుగుతున్నాయి. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో ఈ ఏడాదిలోనే అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 431 కరోనా కేసులు వచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,04,298కి చేరింది. ఇందులో 3,352 యాక్టివ్ కేసులు ఉండగా, వీరిలో 1,395 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇప్పటివరకు 2,99,270 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా ఇద్దరు చనిపోగా, మొత్తం 1,676 మంది మరణించారు. కొత్తగా నమోదైన కేసుల్లో 111 జీహెచ్ఎంసీ పరిధిలో వచ్చాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement