Thursday, May 9, 2024

రూపాయికే టిడ్కో ఇళ్లు!

రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీకు శ్రీకారం చుట్టిన సీఎం వైఎస్ జగన్ మరో వరాన్ని అందిస్తున్నారు. పేదవారి సొంతింటి కలను సాకారం చేసేందుకు కేవలం ఒకే ఒక్క రూపాయికి ఇళ్లు అందించాలని నిర్ణయించారు. 300 చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మించిన 1,43,600 టిడ్కో ఇళ్లను ఒక్క రూపాయి తీసుకుని లబ్ధిదారులకు అందించాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. పురపాలక సంఘాల్లో షియర్‌వాల్ సాంకేతికతతో జీ ప్లస్ 3 అపార్ట్‌మెంట్ల తరహాలో వీటిని నిర్మించారు. ఇప్పటి వరకు టిడ్కో కాలనీగా పిలుస్తున్న ఈ పథకం పేరును ఇకపై ప్రధానమంత్రి ఆవాస్ యోజన-వైఎస్సార్ జగనన్ననగర్‌గా మారుస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఇక, 365 చ.అడుగులు, 430 చ.అ విస్తీర్ణం కలిగిన ఇళ్లకు లబ్ధిదారుల వాటాలో 50 శాతం రాయితీని వర్తింపజేసింది. 365 చ.అ ఇంటికి రూ.50 వేలు, 430 చ.అ ఇంటికి రూ.లక్ష తమ వాటాగా లబ్ధిదారులు చెల్లించాల్సి ఉండగా ఇందులో 50 శాతం రాయితీకి అనుమతిచ్చింది. ఇప్పటికే పూర్తిగా చెల్లించిన వారికి సగం మొత్తాన్ని తిరిగి ఇచ్చేయాలని ఆదేశించింది. లబ్ధిదారుని వాటా ఇప్పటికే చెల్లించినప్పటికీ.. వైసీపీ ప్రభుత్వ ఇళ్ల పట్టాల పథకం వైపు మళ్లిన వారికి పూర్తి మొత్తాన్ని చెల్లించాలని స్పష్టం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement