Monday, May 20, 2024

Tata Punch | మారుతీ సుజుకీకి ‘పంచ్‌’.. అమ్మకాల్లో టాప్‌కు చేరిన టాటా పంచ్‌

దేశ ఆటోమొబైల్‌ రంగంలో మారుతీ సుజుకీ అగ్రామి సంస్థగా ఉంది. తాజాగా ఏప్రిల్‌లో అమ్మకాల్లో మారుతీ సుజుకీ కంపెనీకి చెందిన పాపులర్‌ కార్ల అమ్మకాలను టాటా మోటార్స్‌కు చెందిన పంచ్‌ అధిగమించి సంచలనం సృష్టించింది. టాటా మినీ ఎస్‌యూవీ పంచ్‌ దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కారుగా రికార్డు సృష్టించింది. మారుతీ సుజుకికి చెందిన వ్యాగన్‌ఆర్‌, స్విఫ్ట్‌, బ్రెజా కార్ల కంటే టాటా పంచ్‌ అమ్మకాలు ఏప్రిల్‌ నెలలో పెరిగాయి.

ఈ సంవత్సరం మార్చి నెలలో మారుతీ సుజుకీ వ్యాగన్‌ఆర్‌ అమ్మకాలను టాటా పంచ్‌ అధిగమించింది. మార్చిలో టాటా పంచ్‌ 17,547 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. వ్యాగన్‌ఆర్‌ 16,368 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. హ్యాండాయ్‌ ఎస్‌యూవీ క్రిటా మార్చిలో 16,458 యూనిట్ల అమ్మకాలు జరిగాయని కంపెనీ తెలిపింది. ఏప్రిల్‌ నెలలో పంచ్‌ 19,158 యూనిట్ల విక్రయాలు జరిగాయి.

మారుతీ సుజుకీ వ్యాగన్‌ఆర్‌ 17,850 యూనిట్లు, బ్రిజా 17,113 యూనిట్లు అమ్మకాలు జరిగాయి. మారుతీ సుజుకీ కంపెనీకి చెందిన కార్లు అమ్మకాల్లో అగ్రస్థానంలో లేకపోవడం చాలా అరుదైన సంఘటన అని ఇండస్ట్రీ వర్గాలు వ్యాఖ్యానించాయి. టాటా పంచ్‌ వరసగా రెండు నెలల పాటు అమ్మకాల్లో అగ్రస్థానంలో నిలవడం ఒక సంచలనమని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. పంచ్‌ అమ్మకాలు ఇక ముందు కూడా ఇలానే కొనసాగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

దేశంలో కార్ల పరిశ్రమలో వస్తున్న మార్పులకు ఇది నిదర్శనమని ఈ వర్గాలు అభిప్రాయపడ్డాయి. కార్ల అమ్మకాల్లో మారుతీ సుజుకీ మొదటి స్థానంలో, హ్యుండాయ్‌ రెండో స్థానంలో, టాటా మోటార్స్‌ మూడో స్థానంలో ఉన్నాయి. టాటా మోటార్స్‌కు చెందిన పంచ్‌తో పాటు నెక్సాన్‌, టియాగో, ఆల్ట్రోజ్‌ అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి.

అమ్మకాల జోరుగా ఇలానే కొనసాగితే టాటా మోటార్స్‌ రెండో స్థానంలోకి వస్తుందని, రానున్న రోజుల్లో అగ్రస్థానంలోకి వచ్చినా ఆశ్చర్యంలేదని భావిస్తున్నారు. టాటా పంచ్‌ పెట్రోల్‌, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్‌ వెర్షన్లలో లభిస్తుంది. పెట్రోల్‌ కారు ప్రారంభ ధర 6 లక్షలుగా ఉంటే, ఎలక్ట్రిక్‌ కారు ప్రారంభ ధర 11 లక్షలుగా ఉంది. మార్చిలో టాప్‌ 10 అమ్మకాల్లో ఆరు మారుతీ సుజుకీ మోడల్స్‌ ఉన్నాయి. ఏప్రిల్‌లోనూ ఇదే పరిస్థితి కొనసాగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement