Monday, May 20, 2024

Andhra Pradesh – క‌రెన్సీ క‌ట్టలు తెగుతున్న‌య్‌…ఇంటింటికీ నోట్లతో పరామర్శ‌లు


ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి: ఏపీలో ఎన్నికల యుద్ధంలో ప్రచారం ముగింపు దశకు చేరుకుంది. ఇంటింటికీ నోటు, క్వార్టర్ మందు పంపిణీ పర్వం షురూ అయ్యింది. ఈ క్రతువులో ప్రధాన పార్టీలన్నీ హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. ఓటుకు వెయ్యి నుంచి క్రమంగా ధర పెరుగుతోంది. మరో పక్క ఎన్నికల కమిషన్ డేగ కళ్లకు నోట్ల కట్టల ఆసాములు బావురుమంటున్నారు. ఇంకో వైపు మద్యం పంపిణీలో సరికొత్త పంథాని అభ్యర్థులు అవ‌లంబిస్తున్నారు. తామే నకిలీ మద్యం తయారీ చేసి, ఖర్చు తగ్గించి.. జనం ప్రాణాలను పణంగా పెడుతున్నారు. మరికొంత మంది లీడ‌ర్లు న‌కిలీ నోట్లను రంగంలోకి దించారు. ఏ ఓటు అసలు నోటో… ఏది దొంగ నోటో గుర్తించలేని స్థితి ఏర్పడింది.

ఖర్చు అంచనా.. ₹21,000 కోట్లు

అసెంబ్లీ అభ్య‌ర్థికి ₹40 కోట్లు, లోక‌స‌భ అభ్య‌ర్థఇకి ₹150 కోట్ల చొప్పున మొత్తం ఏపీలో ₹21, 000 కోట్లు ఖర్చు తప్పదని ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక సమయంలోనే ప్రధాన రాజకీయపార్టీలు అంచనా వేశాయి. ఒక ప్రధాన పార్టీ ఏకంగా ఎన్నికల ఖర్చును సీటు కేటాయింపునకు ముందే సీటు ఔత్సాహికుడి నుంచి డిపాజిట్ చేయించిందనే ప్రచారం జ‌రిగింది. అంటే ఏపీలో 175 అసెంబ్లీ సీట్లల్లో రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు ₹40 కోట్లు చొప్పున ₹14000 కోట్లు, ఎంపీ అభ్యర్థులు ₹7000ల కోట్లతో బరిలోకి దిగారని రాజకీయ పరిశీలకుల అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దొంగ నోట్లు, నకిలీ మద్యం తెర మీదకు వచ్చినట్టు కొన్ని ఘటనలతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

- Advertisement -

ఈసీ డేగ కన్ను..

25 రోజుల కిందట కేంద్ర ఎన్నికల సంఘం సమాచారం మేరకు, రోజుకు సగటును ₹100 కోట్ల అక్రమ డబ్బును ఈసీ స్వాధీనం చేసుకుంటోంది. ఏప్రిల్ 16 నాటికి ₹ 4650 కోట్ల మేరకు అక్రమ సొత్తు బయట పడగా.. ఏపీ, తెలంగాణలో ₹ 246 కోట్ల సొమ్ము దొరికింది. అంటే ఈ 9 రోజుల్లో దేశవ్యాప్తంగా ₹ 900 కోట్లు దొరికినట్టే. జార్ఖండ్​లో ఇటీవల ఓ మంత్రి పీఏ దగ్గర ₹ 35 కోట్లు దొరికితే.. తాజాగా గురువారం ఏపీ సరిహద్దు జగ్గయ్యపేటలో ₹ 8 కోట్ల నగదును నిఘా అధికారులు పట్టుకున్నారు. ఇక.. మెదక్ నుంచి గుంటూరు‌కు పైపుల లోడుతో వెళ్తున్న లారీని తనిఖీ చేశారు. అందులో ప్రత్యేక కేబిన్‌లో నోట్ల కట్టలు కనిపించాయి. దాదాపు 8 కోట్ల రూపాయలు దొరికాయి. దీనిపై డ్రైవర్‌ను ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అదుపులోకి తీసుకున్నారు.

కౌంటింగ్​ మెషీన్లతో లెక్కలు..

డబ్బును లెక్కించేందుకు పోలీసులు కౌంటింగ్ మిషన్లను తీసుకొచ్చారు. హైదరాబాద్‌లోనూ పెద్ద మొత్తంలో నగదు దొరికింది. చాకచక్యంగా కాలేజీ బ్యాగులో డబ్బు పెట్టి బైక్‌పై తరలిస్తూ అడ్డంగా దొరికిపోయారు. విశ్వసనీయ సమాచారం మేరకు కూకట్‌పల్లి వసంత్ నగర్ బస్టాప్ సమీపంలో రెండు హీరో ఫ్యాషన్ ప్రో బైక్‌లపై వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు తనిఖీ చేయగా.. ఒకరి దగ్గరి బ్లాక్ కలర్ కాలేజీ బ్యాగ్‌‌లో ₹ 53,37 లక్షలు దొరికాయి. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో గొల్లప్రోలు టోల్ ప్లాజా సమీపంలో ఐదు రోజుల కిందట జరిగిన సోదాల్లో భారీగా నగలు దొరికాయి. విశాఖ నుంచి కాకినాడకు వస్తున్న సీక్వెల్ లాజస్టిక్ సంస్థకు చెందిన వాహనంలో బంగారం, వెండి వస్తువులను పట్టుకున్నారు. మార్కెట్లో ఆయా వస్తువుల విలువ దాదాపు ₹17 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు చెప్పారు. సరైన పత్రాలు చూపకపోవడం, తరలించే వ్యక్తుల పేర్లు లేకపోవడంతో వాహనాన్ని సీజ్ చేసి పిఠాపురం ఎమ్మార్వో ఆఫీసుకు తరలించారు.

దొంగ నోట్లు అంటుగడుతున్న లీడర్లు

ఎన్నికల వేళ సందట్లో సడేమియాలా నకిలీ నోట్ల వ్యవహారం కలకలం రేపుతోంది. ప్రచారంలో పాల్గొన్న కూలీలకు దొంగనోట్ల పంచిన ఘటన నంద్యాలలో వెలుగు చూసింది. దీనిపై బాధితులు ప్రశ్నిస్తే.. తాము మంచినోట్ల ఇచ్చామని సదరు నాయకులు చెప్పారు. తాము మార్చటానికి వెళ్తే దుఖాణాల్లో దొంగనోట్లని తేల్చారు. అంటే.. దొరికిన చోట దొంగనోటు.. దొరకని చోట అసలు నోటుగా నాయకులు చెలామణి చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇక ఓట్ల కొనుగోలులోనూ దొంగ నోట్లే కీలకంగా మారినట్టు తెలుస్తోంది.

పంపిణీకి నకిలీ మద్యం రెడీ

మద్యం డంపులపై నిఘా పెరిగినప్పటికీ.. వివిధ కంపెనీల మద్యం సీసాలను దిగుమతి చేసుకునే బదులు సొంతగా.. నకిలీ మద్యం తయారీలో రాజకీయ పార్టీలు నిమగ్నమయ్యాయి. భారీ మొత్తంలో నాసిరకం మద్యాన్ని తీసుకు వచ్చి పెద్ద పెద్ద కంపెనీల సీసాల్లో రీఫిల్లింగ్​ చేస్తున్నారు. ఇటీవల మచిలీపట్నంలో జరిగిన ఓ భారీ బహిరంగ సభకు జనాన్ని సమీకరించేందుకు ఒక్కొక్క వ్యక్తికి క్వార్టర్​ సీసా ఇచ్చారు. నాయకులు తమకు పంచిన క్వార్టర్ సీసా నకిలీదని వీరిలో ఇదే సరుకు తాగే వ్యక్తి గుర్తించినట్టు సమాచారం. పైగా పాత సీసాలో ఎలా నింపి మూత బిగించారో అర్థం కాక.. ఈ మందు తాగితే చస్తామని రోడ్డు పక్కన పడేసినట్టు సమాచారం. ఇలా పలు గ్రామాల్లో రీఫిల్లింగ్​ చేస్తున్న దృశ్యాలు సోషల్​ మీడియాలో హల్​చల్​ చేస్తున్నాయి. కానీ, పోలీసు అధికారులు ఈ స్థావరాలను గుర్తించలేక పోయారు. ఈ ప్రక్రియ కేవలం కృష్ణా జిల్లాలోనే కాదు.. ఏపీ వ్యాప్తంగా జరుగుతోందని ప్రచారం జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement