Friday, May 17, 2024

Special Story – ఎనుక ఎనుక‌నే ఎర్ర‌జెండా! …. ఏపీలో త‌ప్ప‌ని అగ‌చాట్లు

ఎర్ర‌జెండా ఏ ఊళ్లో ఎగిరినా అక్క‌డ కార్మిక‌, క‌ర్ష‌క వ‌ర్గానికి మేలు జ‌ర‌గుతుంది.. పేద‌ల ప‌క్ష‌పాతిగా జ‌నం గుండెల్లో ఎన్నో ఏండ్లుగా ఎర్ర‌జెండా రెప‌రెప‌లాడింది. అయితే ఇదంతా గ‌తం.. ఇప్పుడు ఎర్ర‌జెండా కొన్ని పార్టీల ఎన‌క ఎన‌క‌నే తిరుగుతూ ప‌బ్బం గ‌డుపుకునే స్థితికి చేరింది. దీనికి చాలా కార‌ణాలున్నాయి. మారుత‌న్న సామాజిక ప‌రిస్థితుల‌తో పాటు ఆ పార్టీ నాయ‌క‌త్వం ఆలోచ‌నా విధానం మార‌క‌పోవ‌డం.. నేటికీ కూలీ, కార్మిక‌ పోరాటాలంటూ మూస ధోర‌ణి అవ‌లంబించ‌డం కూడా కార‌ణం అనే వాద‌నలున్నాయి. దీంతో ఇత‌ర పార్టీల‌కు తోక పార్టీగా క‌మ్యూనిస్టులు మిగిలిపోయారు. కాగా, ప్ర‌స్తుత సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఏపీ, తెలంగాణ‌లో క‌మ్యూనిస్టులు లాల్ స‌లామ్ వ‌ర‌కే ప‌రిమిత‌మ‌య్యారు. వారిని మాత్రం జ‌నం ప‌ట్టించుకోవ‌డం లేదన్న‌ది స్ప‌ష్టంగా తెలుస్తోంది. దీంతో లెఫ్ట్ పార్టీల లీడ‌ర్లు కాస్తా.. రైట్ రైట్ అంటూ ముందుకూ వెన‌క్కి ఊగిస‌లాడుతున్నారు.


జనానికి అస్స‌లు నచ్చట్లే
ఉనికి కోసం కామ్రేడ్స్ ఆరాటం
కాంగ్రెస్‌తో జతకట్టినా వ‌ట్టి ఆర్భాటమే
ఫలితం మాత్రం నిరుత్సాహం
కూట‌మితో క‌లిసి ప్ర‌యాణం
చెరోక ఎంపీ.. 8 అసెంబ్లీ సీట్ల కేటాయింపు
ఎన్నిక‌ల బ‌రిలో క‌మ్యూనిస్టుల పోరాటం
లాల్ స‌లామ్‌ల‌కే లీడ‌ర్లు ప‌రిమితం
రాష్ట్ర విభ‌జ‌న నుంచి న‌మ్మ‌ని జ‌నం

ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి: ఉమ్మడి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఊరూరా ఎగిరి.. రెపరెలాడిన ఎర్ర జెండా.. ప్ర‌స్త‌త ప‌రిస్థితుల్లో ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. ఒకప్పుడు పసుపు దండుతో జత కట్టి చెలరేగిన వామ‌ప‌క్ష‌వాదులు.. ప్రస్తుతం దైన్య స్థితిలో కాంగ్రెస్‌తో మిత్రలాభం అంటూ పోరాటం చేస్తున్నారు. 1985 నుంచి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సరళి పరిశీలిస్తే.. భూర్జువా పార్టీలను వ్యతిరేకించి పేదల పార్టీగా పేరొందిన సీపీఐ, సీపీఎం చివరికి కమ్యూనిస్టు పార్టీలు కాదు.. కమర్షియలిస్టు పార్టీలనే అపవాదును మూటగట్టుకున్నాయి. కేవలం ఇది ఆరోపణ కానే కాదు. 2023 ఎన్నికల్లో ఒక సీటు పొత్తుతో తెలంగాణలో సీపీఐ అభ్యర్థి విజయంసాధిస్తే.. ఇక ఏపీలోనూ కాంగ్రెస్‌తోనే పునర్జీవనానికి 2024 ఎన్నికల్లో సీపీఐ జట్టు కట్టింది.

- Advertisement -

ప్ర‌శ్నించే స్థాయి నుంచి.. అసెంబ్లీలో చోటు కోల్పోయే స్థాయికి

తెలంగాణలో ఒక సీటు కూడా రానందుకు అసెంబ్లీలో అడుగుపెట్టలేక పోయామనే అంతర్మథనంతో ఏపీలో కాంగ్రెస్ తాయిలం కోసం సీపీఎం కూడా అంగీకరించక తప్పలేదు. ప్రస్తుతం ఈ ఎర్రజెండా పార్టీలు చెరికో ఎంపీ సీటు, చెరో ఎనిమిది అసెంబ్లీ సీట్లు తీసుకున్నాయి. ఐతే, ఇక్కడ అగ్రనాయకత్వం పోటీలో కనపడటం లేదు. జిల్లాల్లో కాస్తో కూస్తో జనం మధ్య తిరిగే నాయకులకే టిక్కెట్లు ఇచ్చి.. అగ్రనాయకులు ప్రచార యజ్ఞంలో నిమగ్నమ్యారు. అంటే.. తమ అభ్యర్థులను గెలిపించటానికా? లేక ఓడిపోయే సీట్లల్లో పోటీ దేనికనా? అని ప్రశ్నిస్తే.. లాల్ సలామ్ అనే నినాదమే వినిస్తోంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో లెప్ట్ పార్టీల రైట్ ..రైట్ అనే ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

దేశ రాజకీయాల్లో ఎన్డీఏ దూకుడు కనిపిస్తోంది. రామనాదం.. దేశభక్తి గానంతో బీజేపీ ఉరుకులు పరుగులు పెడుతోంది. ఇక లౌకిక శక్తులు జత కలవక పోతే దేశంలో మతోన్మాదం పెచ్చురిల్లే అవకాశం ఉందనేది వామపక్ష పార్టీలు సహా లౌకిక వాదుల ఆలోచన. అందుకే ఇండియా కూటమి ఆవర్భవించింది. కాంగ్రెస్ , సీపీఐ, సీపీఎం సహా లౌకిక పార్టీలు జత కలిశాయి. కానీ, ఈ కలయిక ఏపీలోని లెప్ట్ పార్టీలను ఇరుకున పెట్టాయి. కాంగ్రెస్‌తో కలిసి పయనిస్తే జనం ఏ రీతిలో తమను చేరదీస్తారో అంతుబట్టని అంశం. అధికారంపై అత్యాశతోనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ముక్కలు చేసిందనే భావన జనంలో ఇంకా తగ్గలేదు. ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ అంపశయ్యపై కోమా దశలో ఉంటే.. ప్రభుత్వంపై వ్యతిరేకతతో రగిలిపోతున్న జనాన్ని ఆకర్షించేందుకు కాంగ్రెస్ పార్టీ .. దివంగత నేత వైఎస్సార్ తనయను రంగంలోకి దించింది. ప్రస్తుతం గెలుపు సంగతేమో గానీ.. ప్రభుత్వ చర్యలపై విసిగిన జనం ప్రత్యామ్నాయాన్ని పరిశీలిస్తున్నారు. ఇక రాష్ట్రాన్ని విభజించాలని సీపీఐ కోరింది. అందుకే ఈ పార్టీపై జనంలో ఆగ్రహం తగ్గటం లేదు. పోలవరం నిర్వాసితులు, విశాఖ ఉక్కు సమస్యలపై పోరాడినా జనంలో నమ్మకం కలగటం లేదు. సీపీఐ నిర్ణయాలను వ్యతిరేకించటమే సీపీఎం లక్ష్యం, అందుకే రాష్ట్ర‌ విభజనను వ్యతిరేకించినా.. సీపీఎంను జనం నమ్మలేదు. అంటే కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం ఈ మూడు పార్టీలపై ఏపీ జనంలో సానుకూల ప్రభావం కనిపించటం లేదనేది రాజకీయ వర్గాల విశ్లేషణ.

రాజకీయాల్లో లెప్ట్.. లెప్ట్ ఇలా..

ఎన్టీఆర్ సర్కారును 1984లో కాంగ్రెస్ పార్టీ కూల్చివేయటంతో.. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఏపీలో వామపక్షాలు ఉద్యమించాయి. ఎన్టీఆర్ పోరాటానికి వెన్నుదన్నుగా నిలిచాయి.1983 ఎన్నికల్లో సీపీఐకి అయిదు సీట్లు, సీపీఎంకి నాలుగు సీట్లు వస్తే.. 1985 ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు ఉమ్మడిగా పోటీ చేయగా 11 స్థానాల్లో సీపీఐ, 11 స్థానాల్లో సీపీఎం విజయం సాధించాయి. అసెంబ్లీలో పేదల గళం వినిపించే స్థాయికి ఎదిగాయి. కానీ ఈ రెండు పార్టీలు జాతీయ , అంతర్జాతీయ రాజకీయాల్లో మమేకమై.. ఏపీలో ప్రజల సమస్యల పరిష్కారంలో వెనుకంజ వేశాయనే అపవాదు తప్పలేదు. అంతే 1989లో సీపీఐ మూడు స్థానాలను, సీపీఎం అయిదు స్థానాలను కోల్పోయాయి. 1994లో ఎన్టీఆర్ నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీతో వామపక్షాలు జత కలవగా.. పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ (సీపీఐ 21 , సీపీఎం 16) విజయం సాధించాయి.

చంద్ర‌బాబుతో ఫ్రెండ్‌షిప్ క‌ట్‌..

1999లో సీన్ రివర్స్ అయింది. చంద్రబాబు ఆధీనంలోని తెలుగుదేశం పార్టీకి వామపక్షాలు దూరమయ్యాయి. ఇందుకు కారణం టీడీపీ బీజేపీతో చేతులు కలపటమే. సీపీఎం 48 స్థానాల్లో, సీపీఐ 45 స్థానాల్లో ఉమ్మడిగా పోటీ చేశాయి. ఈ ఎన్నికల్లో సీపీఎం కేవలం రెండు స్థానాల్లోనే గెలిచింది. 2004లో వామపక్షాలు యూపీఏ జత కలిశాయి. ఈ ఎన్నికల్లో సీపీఎం 14 స్థానాలు, సీపీఐ 12 స్థానాల్లో పోటీ చేశాయి. సీపీఎం 9 , సీపీఐ 6 స్థానాల్లో గెలిచాయి. 2009 లో టీడీపీ, టీఆర్ఎస్సహా మహా కూటమిలో సీపీఎం 18స్థానాలు, సీపీఐ 14 స్థానాల్లో పోటీ చేస్తే సీపీఎం 4 స్థానాల్లో, సీపీఐ ఒక స్థానంలో గెలిచాయి. రాష్ట్ర‌ విభజనతో వామపక్షాల కథ బలహీన పడింది. 2014లో సీపీఐ. సీపీఎం విడివిడిగా పోటీ చేశాయి. సీపీఐ 68స్థానాల్లో పోటీ చేస్తే ఒక స్థానంలో పాడేరులో గిడ్డి ఈశ్వరి 26.243 ఓట్ల మెజారిటీతో గెలిచింది. 38స్థానాల్లో పోటీ చేసిన సీపీఎం ఒక స్థానంలో గెలిచింది. 2019 ఎన్నికల్లో జనసేన పొత్తుతో సీపీఐ ఏడు స్థానాల్లో.. సీపీఎం ఏడు స్థానాలో పోటీ చేసి ఓడిపోయాయి. ఇప్పుడు కాంగ్రెస్ తో కలిసి చెరికో ఒక ఎంపీ , 8 అసెంబ్లీ స్థానాలు చొప్పున ఉభయకమ్యూనిస్టులు పోటీలో ఉన్నారు.

పోటీకి దిగాలంటేనే విముఖత..

జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీతో సీపీఐ, సీపీఎం జత కట్టటంతో ఏపీలోనూ ఉభయపార్టీలు చేతులు కలిపాయి. ఐతే, ఈ ఎన్నికల్లో అగ్రనాయకులెవరూ పోటీ చేయటం లేదు. సీపీఐ రాష్ర్ట కార్యదర్శి కె.రామకృష్ఱ 1994లో అనంతపురం ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పట్లో టీడీపీతో పొత్తుతో ఆ సీటు లభించింది. ఇక 2014, 2019 ఎన్నికల్లోనూ ఆయన పోటీ చేసిన జాడ లేదు. విశాఖపట్నం నాయకుడు జె.సత్యనారాయణ మూర్తి, గుంటూరు నాయకుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు 2019 ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో వీరిద్దరి జాడ లేదు. ప్రస్తుతం గుంటూరుఎంపీ అభ్యర్థిగా జంగాల అజయ్ కుమార్ , విజయవాడ వెస్ట్ అభ్యర్థిగా జీ కోటేశ్వరరావు,విశాఖపట్నం వెస్ట్అభ్యర్థిగా అత్తిలి విమల,అనంతపురం అభ్యర్థిగా జాఫర్ , పత్తికొండ అభ్యర్థిగా రామచంద్రయ్య , తిరుపతి అభ్యర్థిగా పి.మురళి , రాజంపేట అభ్యర్థిగా బూక్యా విశ్వనాథ్ నాయక్ , ఏలూరు అభ్యర్థిగా బండి వెంకటేశ్వరరావు , కమలాపురం అభ్యర్థిగా నర్రెడ్డి శివరామ రెడ్డిసీపీఐ అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు.

సీపీఎంలోనూ అదే స్థితి

ఇక సీపీఎంలోనూ ఇదే స్థితి. గతంలో జరిగిన ఎన్నికల్లో కార్యదర్శి హోదా నాయకులు పోటీల్లో కనిపిస్తే.. ఈ ఎన్నకల్లో అగ్రనాయకులెవరూ లేరు. రాష్ర్ట కార్యదర్శి వర్గ సభ్యుల్లో కొందరూ ప్రస్తుతం పోటీ చేస్తున్నారు. మంగళగిరి లో జొన్నా శివశంకరరావు, రంపచోడవరంలో లోతా రామారావు, అరకు ఎంపీ అభ్యర్థిగా పాచిపెంట అప్పల నర్స , నెల్లూరు సిటీలో ఆదిమూలపు రమేష్ . విజయవాడ సెంట్రల్ అభ్యర్థిగా సీహెచ్ బాబురావు, గన్నవరంలో కళ్లం వెంకటేశ్వరరావు, కురుపాంలో మందంగి రమణ , గాజువాకలో మరడాన జగ్గునాయుడు సీపీఎం అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement