Friday, April 26, 2024

కెసిఆర్ కి ఎటిఎం ‘ఓఆర్ఆర్ లీజ్’ – కిష‌న్ రెడ్డి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: భాగ్య నగరం చుట్టూ ఉన్న ఔటర్‌ రింగు రోడ్డు నిర్వహణ లీజును 30ఏళ్లపాటు ప్రయివేటు కంపెనీకి లీజుకు ఇవ్వాల్సిన అవసరం ఏమి వచ్చిందని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ఓఆర్‌ఆర్‌ లీజు తమ అనుకూలమైన వ్యక్తులకు కట్టబెట్టి ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టాలని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చూస్తోందన్నారు. ఓఆర్‌ఆర్‌ లీజు టెండరు పారదర్శకంగానే జరిగితే ఆరోపణలపై సీబీఐ విచారణకు ప్రభుత్వం సిద్ధమా అని సవాల్‌ విసిరారు. ఓఆర్‌ఆర్‌తో 30 ఏళ్లకు రూ.75 వేల కోట్ల ఆదాయం వస్తుందని, మరి రూ.7380 కోట్లకే లీజు ఇవ్వడం వెనక మతలబు ఏంటో చెప్పాలని సీఎం కేసీఆర్‌ను డిమాండ్‌ చేశారు. లీజు ఏ కంపెనీకి దక్కాలో ముందే సీఎం కేసీఆర్‌ నిర్ణయించారని ఆరోపించారు. ఈ విషయమై నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నేతలు సూర్యప్రకాష్‌, రచనారెడ్డి, గౌతంరావు, రవినాయక్‌ తదితరులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు.

ఓఆర్‌ఆర్‌ లీజు పేరుతో కల్వకుంట్ల కుటుంబం నయా కుంభకోణానికి తెరదీసిందని విమర్శించారు. ప్రయివేటీకరణకు తాము వ్యతిరేకమని పదే పదే చెప్పే కేసీఆర్‌ ప్రభుత్వం మరి వేల కోట్ల ఆదాయాన్ని సమకూర్చే ఓఆర్‌ఆర్‌ను ప్రయివేటు సంస్థకు ఎందుకు లీజుకు ఇచ్చిందని నిలదీశారు. పెరుగుతున్న జనాభా, వాహనాల సంఖ్యను బట్టి లీజు కాలపరిమితిని తగ్గించుకోవచ్చని నిబంధనల్లో ఉన్నా ప్రభుత్వం పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ఇతర రాష్ట్రాల్లో 10, 12ఏళ్ల కాలపరిమితికే లీజుకు ఇస్తే తెలంగాణలో ఏకంగా 30ఏళ్లపాటు లీజుకు ఇవ్వాల్సిన అవసరం ఏంటి..?, సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఓఆర్‌ఆర్‌ మాస్టర్‌ ప్లాన్‌కు మించి టెండర్‌ పిలిచి ఖరారు చేయడం సరికాదన్నారు. నమ్మించి గొంతుకోయడంలో కల్వకుంట్ల కుటుంబం ఆరితేరిందన్నారు. క్రిసిల్‌ సంస్థ రిపోర్టు ఉన్నా… కావాల్సిన వారికి లీజు కట్టబెట్టేందుకే మజార్‌ సంస్థతో సర్వే చేయించారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌కు ఓఆర్‌ఆర్‌ ఏటీఎంగా మారిందని దుయ్యబట్టారు. హైదరాబాద్‌ చుట్టూ వేలాది కోట్ల కుంభకోణాలకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పాల్పడుతోందని, బీజేపీ అధికారంలోకి వచ్చాక అన్నింటిపైనా విచారణ జరిపిస్తామని హెచ్చరించారు. రూ.7272 కోట్ల టెండరును 16 రోజుల వ్యవధిలో రూ.100 కోట్ల మేర పెంచి రూ7,380 కోట్లకు ఖరారు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు.
మణిపూర్‌లో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై కిషన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సంయమనం పాటించాలని ఆ రాష్ట్ర ప్రజలను కోరారు. శాంతియుతంగా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. పరిస్థితులు మరింత అదుపు తప్పకుండా కేంద్ర ప్రభుత్వం అదనపు బలగాలను పంపిందని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement