Saturday, April 27, 2024

కోడిపందాల‌లో ఐటీ నిపుణులు – త‌గ్గెదే లే

ఏపీలో పెద్ద పండుగ అంటే సంక్రాంతి అని తెలిసిన సంగ‌తే. అయితే ఈ పండుగ‌కి కోడిపందాలు కూడా ముఖ్య‌మైన‌వే. ఈ సంద‌డి ఎక్కువ‌గా తూర్పుగోదావ‌రి జిల్లాలో క‌నిపిస్తుంటుంది. ల‌క్ష‌ల రూపాయ‌లు ఈ పందెల‌లో పెడుతుంటారు. పందెం కోసం కోళ్ల‌కి ప్ర‌త్యేకంగా ఆహారం పెడుతూ పందెంకి సిద్ధం చేస్తుంటారు. పందెం కోళ్లు భారీ ధ‌ర‌లు ప‌లుకుతుంటాయి. ఈ పందాల‌ను వీక్షించేందుకు ఇత‌ర రాష్ట్రాల నుంచి వ‌స్తుంటారు. కోడి పందాల్లో డబ్బు సంపాదించాలని కొందరు, తమ సత్తా చాటాలని మరికొందరు పుంజులను బరుల్లోకి దింపుతారు. కోడి పందాల్లో ప్రతి ఏడాది కోట్లాది రూపాయలు చేతులు మారుతాయి. ముఖ్యంగా పండగ మూడు రోజులు నిర్వహించే పందాల్లో ఈ మొత్తం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ ఏడాది ఐటీ నిపుణులు కూడా పెద్ద మొత్తంలో కోడి పందాల్లో పాల్గొనాలని చూస్తున్నారు.

కరోనా వైరస్ ప్రభావంతో గత రెండేళ్ల నుంచి చాలా మంది ఐటీ ఉద్యోగులు.. ఇంటి నుంచే విధులను నిర్వర్తిస్తున్నారు. చాలా మంది రిలాక్స్ కావడానికి.. బయటి ప్రదేశాలకు వెళ్లాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరి దృష్టి గోదావరి జిల్లాల్లో జరిగే కోడిపందాల వైపు మళ్లింది. ఈసారి పండగకు వీకెండ్‌ కూడా తోడు కావడంతో ఫుల్‌గా ఎంజాయ్ చేయవచ్చని వారు భావిస్తున్నారు. ఇందుకోసం వారు ఆ ప్రాంతంలో ఉన్న తమ ఫ్రెండ్స్‌తోని, తెలిసినవారితోని సంప్రందింపులు జరుపుతున్నారు. మరోవైపు గోదావరి జిల్లాలకు చెందిన ఐటీ ఉద్యోగులు.. చాలా కాలంగా ఇంటి వద్దే ఉండటంతో ఈసారి కోడి పందాల్లో పాల్గొనాలని చూస్తున్నారు. కొందరు ఐటీ ఉద్యోగులు ఇంటి దగ్గరే ఉండటంతో పందెం కోళ్లను పెంచి.. విక్రయాలు కూడా జరుపుతున్నారు.

చాలా మంది ఐటీ ఉద్యోగులు రహస్యంగానైనా కోడి పందాల్లో పాల్గొనాలని కొందరు, తమకు తెలిసినవారి ద్వారా డబ్బులు పెట్టాలని మరికొందరు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇక, భీమవరం మండలంలోని ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. రెండు కోళ్లను లక్ష రూపాయల చొప్పున విక్రయించాడంటే కోడి పందాల క్రేజ్ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక, గత కొంతకాలంగా ఐటీ ఉద్యోగులు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కోడి పందాల్లో పాల్గొంటున్నప్పటికీ.. ఈ సారి ఆ సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలా అని ఈ పందాలు అంత‌స‌జావుగా సాగ‌వులెండి. పోలీసుల క‌న్ను ఈ పందాల‌పై ఉంటుంది. దాంతో ర‌హ‌స్యంగా ఆడుతుంటారు ఈ ఆట‌ని. పొలాల్లో , తెలిసిన వారి గెస్ట్ హౌస్ లో లేక ఊరికి దూరంగా ఈ పందాల‌ని వేస్తుంటారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement