Tuesday, May 14, 2024

రైతులు చనిపోతే పట్టించుకోరా?: కేంద్రంపై గవర్నర్ సత్యపాల్ ఫైర్

మేఘాలయ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న రైతు ఉద్యమానికి మద్దతుగా మాట్లాడుతూ ఢిల్లీ పెద్దలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ”కుక్క చనిపోయినా ఢిల్లీ నేతలు సంతాపం తెలుపుతారు. కానీ తీవ్రమైన చలిలో ఆందోళన చేస్తున్న రైతులు చనిపోతే పట్టించుకోరా” అంటూ ప్రశ్నించారు. జైపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మాలిక్ మాట్లాడుతూ.. సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న రైతుల నిరసనపై తాను ఏం మాట్లాడినా వివాదాస్పదం అవుతోందన్నారు. అలా మాట్లాడిన ప్రతిసారి ఢిల్లీ పెద్దల నుంచి ఏదైనా ఫోన్ కాల్ వస్తుందేమోనని ఆలోచించాల్సి వస్తోందన్నారు. ఓ శునకం చనిపోయినా సంతాపం తెలిపే ఢిల్లీ నేతలు సుదీర్ఘంగా సాగుతున్న నిరసనల్లో 600 మంది రైతులు మరణించినా ఆ విషయమే ఎరుగనట్టు ప్రవర్తిస్తున్నారని, లోక్‌సభలో వారి ప్రస్తావన కూడా తీసుకురావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతుల ఆందోళనపై తాను ఏమన్నా మాట్లాడితే, వివాదాస్పదంగా మారుతోందని, అయినా రైతుల ఉద్యమానికి తన మద్దతు కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేయాలని అడిగితే, గవర్నర్‌ పదవిని వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.

అలాగే, ప్రధాని మోదీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సెంట్రల్ విస్టా రీడెవలప్‌మెంట్ ప్లాన్‌ను కూడా మాలిక్ విమర్శించారు. కొత్త పార్లమెంట్ భవనానికి బదులు ప్రపంచ స్థాయి కళాశాలను నిర్మిస్తే బాగుంటుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement