Saturday, April 27, 2024

Eatala Jamuna: ఆ కలెక్టర్ పై కేసులు పెడతాం: ఎమ్మెల్యే ఈటల భార్య

హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ కుటుంబానికి చెందిన జమునా హేచరీస్.. అసైన్డ్ భూములను కబ్జా చేసిన సంగతి నిజమేనని మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కలెక్టర్ వ్యాఖ్యలపై ఈటల భార్య జమున స్పందించారు. తమపై తప్పుడు ప్రకటన చేసిన జిల్లా కలెక్టర్ పై కచ్చితంగా కేసులు పెడతామని ఆమె తెలిపారు. జిల్లా కలెక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసి, గులాబీ కండువా కప్పుకుంటే బాగుంటుందని వ్యాఖ్యానించారు. తమ వ్యాపారాలకు అనుమతులు ఇవ్వొద్దని ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టు సాక్షాత్తు అధికారులే చెపుతున్నారని తెలిపారు. తమ స్థలంలో పెద్ద షెడ్లు వేసుకుంటే తప్పేముందని ఆమె ప్రశ్నించారు. 

తన భర్త టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ప్రభుత్వ పెద్దలు ఒకలా వ్యవహరించారని… టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మరోలా ఉన్నారని జమున విమర్శించారు. టీఆర్ఎస్ కు చెందిన చాలా మంది మంత్రుల పౌల్ట్రీ ఫాంలకు పొల్యూషన్ సర్టిఫికెట్స్ ఉన్నాయా? అని ఆమె నిలదీశారు. మహిళా సాధికారత గురించి మాట్లాడే ముఖ్యమంత్రి కేసీఆర్ తనను వేధించడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో వచ్చిన ఫలితాలే వచ్చే ఎన్నికల్లో అన్ని చోట్ల రిపీట్ అవుతాయని జోస్యం చెప్పారు. వాటిని ఎదుర్కోవడానికి కేసీఆర్ సిద్ధంగా ఉండాలని సూచించారు. రానున్న రోజుల్లో మొత్తం 33 జిల్లాల్లో ఈటల పర్యటిస్తారన్న జమునా.. ఈటలను ఎదుర్కోవడానికి మంత్రి కేటీఆర్ సిద్ధంగా ఉండాలని సవాల్ విసిరారు.

కాగా, ఈట‌ల రాజేంద‌ర్ భూక‌బ్జా వాస్త‌వమేన‌ని మెద‌క్ జిల్లా క‌లెక్ట‌ర్ హ‌రీశ్ నిన్న(డిసెంబర్ 6) చెప్పారు. ఈట‌ల భూముల అంశంపై మెద‌క్ క‌లెక్ట‌ర్ మీడియాతో మాట్లాడారు. మాసాయిపేట మండ‌లం అచ్చంపేట‌, హ‌కీంపేట్ ప‌రిధిలో అసైన్డ్ భూముల‌ను జ‌మునా హ్యాచ‌రీస్ క‌బ్జా చేసింది వాస్త‌వ‌మేన‌ని చెప్పారు. 70.33 ఎక‌రాల భూమిని క‌బ్జా చేసిన‌ట్లు రెవెన్యూ అధికారుల స‌ర్వేలో తేలింద‌న్నారు. అచ్చంపేట‌, హ‌కీంపేట ప‌రిధిలో గల సర్వే నంబర్ 77 నుంచి 82, 130, హ‌కీంపేట్‌ శివారులో గల సర్వే నంబర్ 97, 111లో సీలింగ్ భూముల‌ను క‌బ్జా చేశారని చెప్పారు. స‌ర్వే నంబ‌ర్ 78, 81, 130ల‌లో భారీ పౌల్ట్రీ షెడ్స్, ప్లాట్‌ఫామ్‌లు, రోడ్లను అనుమ‌తి లేకుండా నిర్మించారని తెలిపారు. స‌ర్వే నంబ‌ర్ 81లో 5 ఎక‌రాలు, 130లో 3 ఎక‌రాల‌ను అక్ర‌మంగా రిజిస్ట్రేష‌న్ చేయించుకున్నారని పేర్కొన్నారు. మొత్తంగా 56 మంది అసైనీల భూముల‌ను క‌బ్జా చేసిన‌ట్లు తేలింద‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement