Friday, April 26, 2024

డెల్టా ప్లస్​ వేరియంట్ పై టీకా పనిచేస్తుందా..?

కరోనా వైరస్ రెండో వేవ్​లో డెల్టా, అల్ఫా వేరియంట్లు​ తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ రకాల వల్ల వైరస్​ వేగంగా వ్యాపించడంతో పాటు కొంతమందిలో ప్రమాదకరంగానూ మారి ప్రాణాలు తీసింది. అయితే రెండో వేవ్ ఉద్ధృతి తగ్గుతున్న ప్రస్తుత తరుణంలో తాజాగా డెల్టా ప్లస్ వేరియంట్ బయటపడడంతో ఆందోళన నెలకొంది. మళ్లీ వైరస్ వ్యాప్తి పెరుగుతుందోమోనని భయం వ్యక్తమవుతుంది. డెల్టా వేరియంట్​ రూపాంతరం చెంది.. కొత్తగా డెల్టా ప్లస్​గా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఈ డెల్టా ప్లస్​ వేరియంట్‌తో ప్రస్తుతానికి పెద్దగా ముప్పు లేకపోయినా..​ భారత్​లో థర్డ్​ వేవ్​కు ఇది దారితీస్తుందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

నీతి ఆయోగ్​ సభ్యడు డాక్టర్​ వీకే పాల్​ మాట్లాడుతూ.. ‘‘డెల్టా వేరియంట్​ నుంచి కొత్తగా డెల్టా ప్లస్​ వేరియంట్​ పుట్టుకొచ్చింది. గత కొన్ని రోజులుగా కరోనా బాధితుల్లో డెల్టా ప్లస్​ వేరియంట్​ కేసులు గుర్తించడం నిజమే. కానీ ఈ కొత్త వేరియంట్​ వేగంగా వ్యాప్తి చెందుతుందని చెప్పేందుకు స్పష్టమైన ఆధారాలు లేవు. ప్రస్తుతానికి దీన్ని కేవలం కొత్త వేరియంట్​ గానే భావిస్తున్నాం. ఇది ప్రమాదకరమైన B.1.617.2 నుంచి పుట్టుకొచ్చిందని స్పష్టంగా చెప్పలేం. ఇది ప్రమాదకరమైన వేరియంట్ అనే సంకేతాలు ఇప్పటివరకూ కనిపించలేదు” అని చెప్పారు.

అయితే డెల్టా ప్లస్ వేరియంట్​ పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు ఎయిమ్స్​ డైరెక్టర్​ రణ్​​దీప్​ గులేరియా. వ్యాక్సిన్​ సమర్థతపై ఆ రకం వైరస్ ప్రభావం చూపించవచ్చని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. అయినా వ్యాక్సిన్ తీసుకుంటే ఈ వేరియంట్​ వల్ల ప్రమాదం ఉండదని స్పష్టం చేశారు. అందుకే వ్యాక్సిన్ వేసుకుంటే ఒకవేళ వైరస్ సోకినా పరిస్థితి ప్రమాదకరంగా మారదు” అని గులేరియా స్పష్టం చేశారు. ప్రజల ప్రాణాలను కాపాడడం, తీవ్ర అనారోగ్యం బారిన పడకుండా చూడడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇక కొవిషీల్డ్​వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధిని పెంచడంపైనా గులేరియా మాట్లాడారు. ఆలస్యంగా రెండో డోసు ఇస్తే రోగనిరోధక శక్తి మెరుగ్గా పెరుగుతుందని నేషనల్​ టెక్నికల్​ అడ్వైజరీ గ్రూప్​ ఆన్​ ఇమ్యూనిటీ (ఎన్​టీఏజీఐ) పరిశోధనల్లో తేలిందని ఆయన అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement