Friday, April 26, 2024

America | రహస్య పత్రాల కేసులో అభియోగాలు.. ఎలాంటి తప్పు చేయలేదన్న ట్రంప్‌

ప్రభుత్వానికి చెందిన వందలాది రహస్య పత్రాలను తరలించుకుపోయిన కేసులో తనపై ఏడు నేరాభియోగాలు మోపినట్టు జస్టిస్‌ డిపార్ట్‌మెంట్‌ తనకు సమాచారం ఇచ్చిందని అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తన సోషల్‌ మీడియా ట్రూత్‌లో పేర్కొన్నారు. తద్వారా అమెరికా చరిత్రలో నేరాభియోగాలు ఎదుర్కొన్న తొలి మాజీ అధ్యక్షుడిగా ఆయన అప్రతిష్టపాలయ్యారు. ”నేను అమాయకుడ్ని. నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఒకానొక అమెరికా మాజీ అధ్యక్షుడికి ఇలా జరుగుతుందని నేను ఒక్కనాటికి అనుకోలేదు. మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు మియామిలో ఫెడరల్‌ కోర్టు హౌస్‌ ఎదుట హాజరు కావాలని నాకు సమన్లు వచ్చాయి” అని ట్రంప్‌ అన్నారు.

వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్‌ను గద్దె దించి అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకోవడానికి డోనాల్డ్‌ ట్రంప్‌ చేస్తున్న ప్రయత్నాలు నేరాభియోగాలు పిడుగుపాటు లాంటివని సంబంధిత వర్గాలు తెలిపాయి. వచ్చే ఎన్నికల్లో తనను బలహీనపరిచేందుకు ప్రభుత్వం జస్టిస్‌ డిపార్ట్‌మెంట్‌ను ఒక ఆయధంగా వాడుకుంటున్నదని ట్రంప్‌ ఆరోపించారు. రాజకీయంగా తనను నిలవరించేందుకే నిలువెత్తు అవినీతిలో కూరుకుపోయిన జో బైడెన్‌ పాలనా యంత్రంగా ఇలాంటి చర్యలకు తెగబడుతున్నదని విమర్శించారు. 2024 ఎన్నికలకు తన ప్రచారాన్ని ఎలాంటి నేరాభియోగాలు అడ్డుకోలేవని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement