Friday, April 26, 2024

Russia | రంగంలోకి రష్యా అణ్వాయుధాలు.. జులైలో బలారస్‌లో మోహరించేందుకు సన్నాహాలు

జులై 7, 8 తేదీల్లో బలారస్‌లో వ్యూహాత్మక అణ్వాయుధాలను మోహరింపజేయడం మొదలుపెడతామని బెలారస్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ లుకషెంకోతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ చెప్పినట్టు రష్యా ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇద్దరు నేతలు శుక్రవారం సోచిలో సమావేశమైన సందర్భంగా పుతిన్‌ పై ప్రస్తావన చేశారు. రష్యాకు చెందిన అణు క్షిపణులను బలారస్‌లో మోహరింపజేయాలని, అవి రష్యా నియంత్రణలో ఉండాలనే ఒక ప్రణాళికకు గతంలో నేతలిద్దరూ ఒక అంగీకారానికి వచ్చారు. ఈ ఏడాది మార్చిలో రష్యా అధ్యక్షుడు ఇదే తరహా ప్రకటన చేయగా దానిపై అమెరికా ఆచితూచి స్పందించింది.

అణ్వాయుధాలను వినియోగించే ప్రణాళికలో రష్యా ఉందనడానికి ఎలాంటి సంకేతాలు లేవని అమెరికా ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. యుద్ధ భూమిపై నిర్దేశిత ప్రయోజనాల కోసం వ్యూహాత్మక అణ్వాయుధాలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తారు. నగరాలను తుడిచిపెట్టే సామర్థ్యాన్ని కలిగిన అణ్వాయుధాలను ఈ పనికి వినియోగించరు. రష్యా, బెలారస్‌ కుదుర్చుకున్న ఒక ఒప్పందం ప్రకారం రుణాలు, రాయితీలపై చమురు, సహజవాయువులను సరఫరా చేయడం ద్వారా బెలారస్‌ ఆర్థిక వ్యవస్థకు రష్యా కాపుకాస్తుంది. పొరుగు దేశం ఉక్రెయిన్‌పై దండయాత్ర చేయడానికి ఒక అనువైన వేదికగా బెలారస్‌ భూభాగాన్ని రష్యా వినియోగించుకుంది. ఆ క్రమంలో భారీ ఎత్తున సైనిక బలగాలు, ఆయుధాలను అక్కడ ఉంచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement