Thursday, May 23, 2024

మంత్రి కాన్వాయ్‌ వద్ద నినాదాలు చేయడం నేరమా?: చంద్ర‌బాబు

ఒంగోలులో 17 మంది టీడీపీ మ‌హిళా నేత‌ల‌పై అట్రాసిటీ కేసులు పెట్టడాన్ని ఆపార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఖండించారు. రేపల్లె అత్యాచార బాధిత మహిళకు భరోసా ఇవ్వాలంటూ మంత్రి కాన్వాయ్‌ వద్ద నినాదాలు చేయడం నేరమా? అని చంద్ర‌బాబు నిల‌దీశారు. నినాదాలకే అట్రాసిటీ కేసులు పెట్టడం ప్రభుత్వ దిగజారుడుతనానికి పరాకాష్ట అని ధ్వజమెత్తారు. మహిళా నేతలపై కేసులు పెట్టడం ప్రభుత్వ బలహీనతకు నిదర్శనమన్నారు. మహిళలపై హింసను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయ‌న విమ‌ర్శించారు. గళమెత్తిన గొంతులను ప్రభుత్వం నొక్కే ప్రయత్నం చేస్తోందని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఒంగోలులో మహిళలపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయ‌న డిమాండ్ చేశారు. అదుపులోకి తీసుకున్న టీడీపీ మ‌హిళా నేత‌ల‌ను విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

కాగా, ఇటీవల రేపల్లె రైల్వేస్టేషన్‌లో నిద్రిస్తున్న ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంకు చెందిన వివాహితపై సామూహిక అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. బాధిత మహిళ ఒంగోలు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా పరామర్శకు వెళ్లిన హోంమంత్రి తానేటి వనిత కాన్వాయ్‌ వద్ద టీడీపీ మహిళా నేతలు నినాదాలు చేశారు. దీంతో వారిపై పోలీసులు కేసులు పెట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement