Sunday, June 16, 2024

Narayana… Narayana – ఆ ఒక్కటీ..అడగొద్దు! అన్నీ అక్ర‌మ‌ అడ్మిషన్లే

ఎవ‌రి ప‌ర్మిషన్‌తో పని లేదు
బినామీ కాలేజీలూ వారివే
కోచింగ్ సెంటర్ల పేరుతో ద‌గా
నీట్ పేరుతో ఎంచ‌క్కా దోపిడీ
ట్రిపుల్ ఐటీ ఎరతో ఫీజుల వాత‌
ఇంటర్ బోర్డుకు ఇవేం క‌నిపించ‌వు
ఉన్న‌తాధికారుల‌కు అస్స‌లు ప‌ట్ట‌దు
ఇక.. ప్రశ్నించడం అనే మాటే లేదు
ఇదే.. నారాయణ‌.. నారాయ‌ణ‌!

ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి: తెలుగు నేలపై ఎడ్యుక్యూషన్ రంగంలో హెవీ టైకూన్ అంటే ఎవరో తెలుసా? తెలీదా.. అయితే రామాయణం బదులు నారాయణం తెలుసుకోవాలి. ఓ గింజతో బాదం మొక్కను నాటి.. అనతికాలంలో వందల వేల బాదం కాయలతో స‌హా.. బాదం పప్పును ఆరగించగలిగే.. గొప్ప నారాయణ యానం అనిర్వచనీయం. ఈ రోజు కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల‌ పిల్లలే కాదు.. అస్సాం, బీహార్, పశ్చిమ బెంగాల్, గోవా సహా అనేక రాష్టాల స్టూడెంట్స్‌ నుంచి నీటుగా పిండేస్తున్న ఈ దిగ్గజం స్టయిలే వేరు. ఇంజనీరింగ్, మెడిసిన్, చివ‌రాఖ‌రికి ఐఐటీల్లో సీటు రావాల‌న్నా విజయవాడలోని నారాయణ కోచింగ్ సెంటర్లకు తరలి రావాల్సిందే. లక్షలకు లక్షల ఫీజు చెల్లించాల్పిందే. నిజంగా విద్యలవాడ విజయవాడ జాతీయ స్థాయిలో మార్మోగి పోతుంటే.. ఉక్రోశం దేనికీ అని కొంత‌మంది అడుగుతుంటారు. కానీ.. కోచింగ్ సెంటర్ల పేరుతో బినామీ కాలేజీలను నిర్వహిస్తూ.. పెద్ద మొత్తంలో దోచేయ‌డం వ‌న్ అండ్ ఓన్లీ నారాయ‌ణ‌కే సాధ్యం. ఇది జ‌గ‌మెరిగిన స‌త్యం..

- Advertisement -

బినామీ కాలేజీల కథలెన్నో..

ఇంటర్మీడియెట్ బోర్డు అనుమతితో ఏపీలో ఇప్పటికి 3347 పైగా జూనియర్ కాలేజీలున్నాయి. అయినా.. ఏటా పదుల సంఖ్యలో వాడ వాడలో జూనియర్ కాలేజీలు వెలుస్తూనే ఉన్నాయి. కానీ, అసలు గుట్టు పెరుమాళ్లకే ఎరుక. ఇంటర్మీడియెట్ అడ్మిషన్ సమయంలోనే సదరు విద్యార్థికి ఓ కోర్సులో కోచింగ్ ఇవ్వాలో ఆప్షన్ ఉంటుంది. జేఈఈ ఐఐటీకి, నీట్, ఎంసెట్‌కు కొందరు.. ఇంజనీరింగ్ కోర్సులను మరి కొందరు ఎంచుకొంటారు. ప్రస్తుతం చేతిలో ఉన్న ప్రభుత్వ గుర్తింపు పొందిన 117 కాలేజీల్లో సీట్లు భర్తీ కాగా.. ఇంకా వచ్చిన విద్యార్థులను కోచింగ్ సెంటర్లకు తరలిస్తారు. ప్రతి కోచింగ్ సెంటర్‌లోనూ 1000 నుంచి 1200 మందికి అడ్మిషన్లు దొరుకుతాయి. ఏపీ మొత్తంలో 26 జిల్లాల్లో 26 కోచింగ్ సెంటర్లు వెలుస్తాయి. అంటే.. 26000 మంది అనధికార విద్యార్థులకు అడ్మిషన్లు ఉంటాయ‌న్న‌మాట‌. కానీ, ఒక్కో విద్యార్థికి లక్ష చొప్పున‌ ఇంటర్మీడియట్ ఫీజుతో అనధికార వసూళ్ల ప‌ర్వం మొత్తం ఎంత‌న్న‌ది ఎవ‌రు లెక్క తేల్చాలి..

ఆ ఒక్కటీ అడక్కూడదు..

ఇంతమంది విద్యార్థులకు అనధికారికంగా అడ్మిషన్లు ఇస్తే.. వీరికి పరీక్ష ఎలా నిర్వహిస్తారు. పరీక్ష రాయటానికి అనుమతి ఎవరిస్తారు అనే విష‌యాలేవీ ఎవ‌రూ అడ‌గొద్దు. మ‌రి దీనికి ప‌ర్మిష‌న్ ఎవరిస్తారంటే.. ఎంపీసీ, బైపీసీ గ్రూపులున్నప్పటికీ.. విద్యార్థులు చేరక ఈగలు తోలుకునే జూనియర్ కాలేజీలే ఈ కంపెనీకి ఆధారం. పరీక్షల సమయంలో తమ విద్యార్థుల పేరు మీద ఫీజులు కట్టేస్తారు. విద్యార్థికి రెండు మూడు వేలు చొప్పున అదనంగా బోనస్ చెల్లిస్తారు. నామినేషన్ రోల్స్ తయారీలో హాజరు పట్టీలు అవసరం. అందుకు అనుగుణంగా రికార్డులు రూపొందుతాయి. వీటికి ఖర్చులు అదనం. ఇక ఆర్ఐఓ కార్యాలయ సిబ్బంది తమ జేబులో మనుషులే. అన్నీ సక్రమంగా సాగిపోతాయి. హాల్ టిక్కెట్లను తమ కేంద్రంలోనే డౌన్ లోడ్ చేసుకుని పిల్లల్ని పరీక్ష కేంద్రాలకు తరలిస్తారు. ఇదండీ నారాయ‌ణ వారి తంత్రి.. సాగుతోంది ఇదే అసలు కథ. ఇక కోచింగ్ సెంటర్ల‌కు ఎలాంటి అనుమతి అవసరం లేదు.

మరి ఇంటర్ బోర్డు ఏంచేస్తుంది?

విద్యా వ్య‌వ‌స్థ‌లో ఇంట‌ర్ బోర్డు ప‌నితీరు ఎంతో కీల‌కం.. కానీ, కొంత‌మంది లంచ‌గొండు ఉద్యోగుల తీరుతో నారాయ‌ణ వంటి బ‌డా విద్యా సంస్థ‌ల‌కు ప‌ని ఈజీ అవుతుంది. సదా షరా మామూలే అన్న‌ట్టు అన్ని లెక్క ప్రకారమే జరిగినట్టు నివేదికలు సిద్ధం అయిపోతాయి. పైగా పరీక్షలను ఎంతో పకడ్బందీగా నిర్వహించామని, ఎక్కడా కాపీయింగ్ జరగలేదని, పేపర్ లీక్ కాలేదని ఓ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేస్తారు. కానీ, రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఎన్ని? ఎంత మంది విద్యార్థులు పరీక్ష రాశారు. వాళ్లకి వచ్చిన మార్కుల గురించి మాత్రం ఎవ‌రూ ప్రశ్నించరు. దీనికి కారణం మార్కులు, ర్యాంకుల కోసం తల్లిదండ్రులే.. ప్రైవేటు గడప తొక్కటంతో ఈ కార్పొరేట్ కాలేజీలు రెచ్చి పోతున్నాయి.

టెన్త్ పరీక్షల్లోనూ.. మోసం దగా!

ఈ కార్పొరేట్ కాలేజీలన్నీ సీబీఎస్ఈ సిలబస్‌తో మోడరన్, టెక్నో స్కూళ్లపై దృష్టి సారిస్తే.. మధ్యతరగతి ప్రైవేటు హైస్కూళ్లన్నీ నారాయణ జపంతో సాగుతుంటాయి. తమ పాఠశాలలో 50 మంది పదో తరగతి విద్యార్థులుంటే.. 100 శాతం రిజల్ట్‌ను కార్పొరేట్ కాలేజీలే సాధిస్తాయి. అందుకు అవసరమైన ఆర్థిక సాయం అందజేస్తాయి. దీంతో తమ 50 మంది టెన్త్ విద్యార్థులను నారాయణ పేరుతో సాగనంపుతారు. పదో తరగతి పరీక్షల్లో గతేడాది కంటే ఈ విద్యాసవంత్సరంలో 14 శాతం అధికంగా ఉత్తీర్ణులయ్యారు. ఇంగ్లిష్‌ మీడియంలో 4,50, 304 మంది విద్యార్థులు పరీక్ష రాస్తే.. 4,15,743 మంది (92.32శాతం), పాస్ అయ్యారు. తెలుగు మీడియంలో 1, 61,881 మంది పరీక్ష రాస్తే 1, 15,060 మంది (71.08శాతం) విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. అంటే ఏపీ మొత్తంలో 5.30 లక్షల మంది కాలేజీల్లో చేరాలి. వీరిలో ఐటీఐ, పాలిటెక్నిక్ , ప్రభుత్వ కాలేజీల్లో సుమారు 2 లక్షల మందికి సీట్లు లభిస్తే.. మిగిలిన 3.30 లక్షల మంది ఏకాలేజీల్లో చేరాలి. కాగా, వీరంతా చచ్చినట్టు.. ఫస్ట్ క్లాస్ పిల్లల్లో మెరికలందరూ నారాయణ బస్సు ఎక్కాల్సిందే. అంటే ప్రభుత్వం కూడా.. కార్పొరేట్ కాలేజీల బాగోగుల కోసమే శ్రమిస్తోంద‌ని తెలుస్తోంది. ఇట్లాంటి విద్యావ్య‌వ‌స్థని బాగు చేయాల్సిన అధికారులు అస్స‌లు ప‌ట్టించుకోరు. కానీ, పిల్ల‌ల భ‌విష్య‌త్ కోసం తల్లిదండ్రులు నానా క‌ష్టాలు ప‌డి ల‌క్ష‌లాది రూపాయ‌ల ఫీజులు క‌ట్టి న‌ష్ట‌పోవాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement