Sunday, June 16, 2024

EVM Destroy Case – పోలీసుల‌కే టోక‌రా! ఎమ్మెల్యే పిన్నెల్లి మళ్లీ ఎస్కేప్‌

మాచ‌ర్ల ఎమ్మెల్యే కోసం పోలీసుల జ‌ల్లెడ‌
చిక్కిన‌ట్లే చిక్కి జారుకున్న రామ‌కృష్ణారెడ్డి
సరిహ‌ద్దులు దాటేశార‌ని అనుమానాలు
ఇప్ప‌టికే లుకౌట్ నోటీస్ జారీ
ఏపీ, తెలంగాణ‌, మ‌హారాష్ర చెక్ పోస్ట‌ల్లో అల‌ర్ట్

మాచ‌ర్ల ఈవీఎంల ధ్వంసం కేసులో నిందితుడు ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి పోలీసుల‌కు చుక్క‌లు చూపుతున్నారు. అత‌ని ఫోన్ లొకేష‌న్ ట్రాక్ చేసి, ప‌ట్టుకుందామ‌ని వెళ్లిన పోలీసుల‌కు టోక‌రా ఇచ్చి మ‌రీ వేరే కారులో జంప్ అయ్యారు. దీంతో అత‌డిపై లుకౌట్ నోటీస్ జారీ చేసి ఏపీ పోలీసులు గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. కాగా, మ‌హారాష్ట్ర‌, త‌మిళనాడు, ఏపీ, తెలంగాణ చెక్​పోస్ట్​ల‌లో త‌నిఖీలు ముమ్మ‌రం చేశారు. ఇదిలా ఉంటే.. ఈ నెల 13న ఏపీలో పోలింగ్ జరిగిన రోజు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్వాయి గేట్ పోలింగ్ బూత్​లో సృష్టించిన అరాచకం వీడియో సంచలనం సృష్టించింది. ఏకంగా ఏడు ఈవీఎంలను ప‌గుల‌కొట్టిన‌ట్లు అధికారులు స్పష్టంచేశారు. దీంతో పిన్నెల్లిపై ఏకంగా 10 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. పోలీసులు అరెస్ట్ చేస్తారన్న భయంతో పిన్నెల్లి పరారైనట్టు తెలుస్తోంది. తన సోదరుడు వెంకట్రామిరెడ్డితో కలిసి జంప్​ అయినట్టు పోలీసులు తెలిపారు.

- Advertisement -

సంగారెడ్డి జిల్లా మీదుగా..

ముందు సంగారెడ్డి, తర్వాత ఇస్నాపూర్ ఫామ్ హౌస్.. ఆ తర్వాత ఇంకెక్కడ ఉన్నారనే విషయాన్ని పోలీసులు వెతుకుతున్నారు. అన్ని ఎయిర్ పోర్టులను అలర్ట్ చేశారు. పిన్నెల్లి హైదరాబాద్​లో ఉన్నారనే విషయం తెలుసుకున్న పోలీసులు.. ఇందూ విల్లాస్​కు చేరుకున్నారు. అక్కడ ఆయన ఇంటి నుంచి కారు బయటకు రాగా.. ఆ కారును ఫాలో అయ్యారు. నేషనల్ హైవే 65పై కారు స్పీడుగా వెళ్లడం గమనించి సంగారెడ్డి జిల్లా పోలీస్ యంత్రాంగం సహాయం కోరారు. పిన్నెల్లి కోసం సంగారెడ్డి పోలీసులు కంది కూడలి వద్ద పాగా వేశారు. టెంపరరీ చెక్ట్ పోస్ట్ ఏర్పాటు చేసి.. అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే.. కారు హైవే వైపు రాకుండా.. పటాన్ చెరు వైపు దారి మళ్లింది. రుద్రారం వైపుగా కొంతదూరం వెళ్లిన కారు.. గణేష్ తండా వద్ద ఆగిపోయింది. ఆ కారులో ఏపీ పోలీసులకు డ్రైవర్, గన్ మ్యాన్ మాత్రమే కనిపించారు. పిన్నెల్లి ఫోన్ వారివద్దే ఉండటాన్ని చూసి షాకయ్యారు. పోలీసుల్ని పిన్నెల్లి తప్పుదోవ పట్టించాడని అర్థమైంది.

డ్రైవర్​, గన్​ మ్యాన్​ అదుపులోకి..

పిన్నెల్లి కారుతో వెళ్లిన డ్రైవర్​, గన్​ మ్యాన్​ ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పిన్నెల్లి గురించి విచారించగా అసలు విషయం చెప్పారు. కారు ఆగగానే ఫోన్‌ తమకిచ్చిన పిన్నెల్లి.. డివైడర్‌ దాటి రోడ్డుకు అటువైపు వెళ్లారని, అప్పటికే అక్కడ మరో వాహనం సిద్ధంగా ఉందని అందులో ఎక్కి హైదరాబాద్‌ వైపు వెళ్లిపోయారని వివరించారు. డ్రైవర్, గన్ మ్యాన్ ను సంగారెడ్డి సీసీఎస్​కు తరలించారు. అయితే.. తానెక్కడికీ పారిపోలేదని పోలీసుల సూచన మేరకు హైదరాబాద్ వచ్చానని పిన్నెల్లి చెబుతున్నా.. దేశం దాటి వెళ్లిపోయారన్న వార్తలు ప్రచారం అవుతున్నాయి.

దుబాయ్​కా… నేపాల్​కా

రామకృష్ణారెడ్డి దుబాయ్‌ వెళ్లేందుకు ప్లాన్‌ చేసుకున్నారని, పోలీసుల అప్రమత్తమై అరెస్ట్ కు రంగం సిద్ధం చేయడంతో.. ఆయన వ్యూహం బెడిసికొట్టినట్టు తెలుస్తోంది. ఇప్పుడు నేపాల్ పారిపోయే అవ‌కాశం ఉందని కొంతమంది పోలీసు అధికారులు చెబుతున్నారు. పిన్నెల్లి సోదరులకు తెలంగాణలో ప‌లు పార్టీల‌ నేతలతో మంచి సంబంధాలున్నాయని, వారి ఫామ్‌హౌస్‌లో తలదాచుకున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇదంతా కాదు.. తమిళనాడుకు వెళ్లినట్లు మరో వార్త చక్కర్లు కొడుతోంది.

అత‌డి కోసం ఎనిమిది బృందాలు వేటాడుతున్నాయి…. సిఈవో..

ఈ కేసులో నిందితుడిగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేసేందుకు ఎస్పీ, డీఎస్పీలతో 8 పోలీసు బృందాలు పనిచేస్తున్నాయన్నారు రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా… . పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు విషయంలో ఈసీ సీరియస్‌గా ఉందని, త్వరలోనే అరెస్టు చేసి తీరుతామని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement