Monday, May 13, 2024

Big Fight – ఖ‌మ్మం గుమ్మమెవ‌రిది…?

తెలంగాణా తొలి, మలి దశ ఉద్యమాలకు కేరాఫ్‌గా ఉన్న ఉద్యమాల ఖిల్లా, పోరాటాల పోరుగడ్డ, రాజకీయ చైతన్యానికి ప్రతీక అయిన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ సారి జరిగే అసెంబ్లి ఎన్నికలు రాజకీయ కురుక్షేత్ర సంగ్రామాన్ని తలపించను న్నాయి. అభివృద్ధి నినాదంతో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ వరుసగా హ్యాట్రిక్‌ విజ యం వైపు దూసుకుపోతుండగా, అంతే రీతిలో ప్ర భుత్వ విప్‌ రేగా కాంతారావు వరుస విజయం కోసం పినపాకలో తన రాజకీయ వ్యూహానికి పదును పెడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో బీఆర్‌ఎస్‌ పార్టీలోకి వలస వచ్చిన మెజార్టీ ఎమ్మెల్యేలు గెలుపే విశ్వాసంతో ముందుకు సాగుతున్నా… విపక్షాల రాజకీయ చతురత, బీఆర్‌ఎస్‌ వ్యతిరేక పవనాల నేపథ్యంలో రానున్న ఫలితాలు ఆసక్తికరంగా ఉండనున్నాయి.

ఉమ్మడి ఖమ్మం, ప్రభన్యూస్‌ బ్యూరో:

1969లో తెలంగాణా తొలి దశ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన ఖమ్మం జిల్లా మలిదశ ఉద్యమంలో కూడా అంతే ప్రాధాన్యతతో ఉద్యమనేత, సీఎం కేసీఆర్‌కు అండగా నిలిచింది. ఉద్యమ సమయంలో కేసీఆర్‌ను ఖమ్మం జిల్లా జైలుకు తరలించడం, ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలో అత్యవసర చికిత్స అందించిన ఘటనలు కేసీఆర్‌ జీవితాన్నే మలుపుతిప్పి రాష్ట్ర సాధనకు అవకాశం కల్గించాయి. అటువంటి జిల్లాలో ఉన్న పది అసెంబ్లిd స్థానాల్లో 2014, 2018 ఎన్నికల్లో నాటి టీఆర్‌ఎస్‌, నేటి బీఆర్‌ఎస్‌ కేవలం ఒక్కో సీటును మాత్రమే గెలవగా, 9 స్థానాల్లో కాంగ్రెస్‌తో పాటు ఆ పార్టీతో కలిసిన విపక్ష పార్టీలు గెలిశాయి. వారిలో ఏడుగురు ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌లో చేరినా.. వారు మళ్లిd గెలవడం సవాల్‌గానే ఉండనుంది. ఒకనాడు జలగం వెంగళరావు లాంటి గొప్ప నాయకుడిని గెలిపించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసిన ఖమ్మం జిల్లాలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మాజీ కేంద్ర మంత్రి రేణుకాచౌదరి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి లాంటి రాజకీయ ఉద్దండులు ఎంతో మంది ఉన్నా రాష్ట్రంలో అధికారం ఏ పార్టీకి ఉంటే అందుకు విరుద్ధంగా జిల్లా ప్రజలు తీర్పునిస్తుండడం విశేషం.


విభిన్న విజయాలకు ఖమ్మం జిల్లా కేరాఫ్‌..
తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షతో రగిలిన ఉమ్మడి ఖమ్మం జిల్లా మొదటి నుంచీ కమ్యూనిస్టుల ఆధిపత్యాన్ని కలిగి ఉంది. సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ లాంటి విప్లవ పార్టీ నుండి ఇల్లందు ఎమ్మెల్యేగా వరుసగా 5 సార్లు గుమ్మడి నర్సయ్యను గెలిపించిన ఘన చరిత్ర ఖమ్మం జిల్లాకు ఉంది. ప్రస్తుతం సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న తమ్మినేని వీరభద్రం ఖమ్మం నుండి ఎంపీగా, ఎమ్మెల్యేగా చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించి ఉన్నారు. భద్రాచలం నుండి సున్నం రాజయ్య ఎంతో కాలం పాటు సీపీఎం ఎమ్మెల్యేగా కొనసాగారు. ప్రస్తుతం సీ పీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న కూనంనేని సాంబశివరావు గతంలో కొత్తగూడెం ఎమ్మెల్యేగా గెలుపొందారు. సీపీఐ జాతీయ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు సుదీర్ఘ కాలం పాటు నాడు ఎన్‌టీఆర్‌ ప్రభుత్వంలో, తర్వాత చంద్రబాబు, వైఎస్‌ఆర్‌ ప్రభుత్వాలలో ఎమెల్యేగా, ఎమ్మెల్సీగా కీలక పాత్రను పోషించారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా నుండే సుధీర్ఘ కాలం టీడీపీ ప్రభుత్వంలో, తర్వాత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. వైఎస్‌ఆర్‌ మరణం తర్వాత కొత్తగా పుట్టుకొచ్చిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కూడా 2014 పార్లమెంటు ఎన్నికల్లో ఒక ఎంపీ సీటును, అంతకు ముందు మూడు ఎమ్మెల్యే స్థానాలు గెలిచింది. అటువంటి రీతిలో వైవిధ్య భరితంగా జిల్లా ప్రజలు ఒక్కో ఎన్నికల్లో ఒక్కో ర కమైన ఫలితాలతో అన్ని పార్టీలకు అవకాశం కల్గించడంతో విభిన్న విజయాలకు ఖమ్మం కేరాఫ్‌గా మారింది.

అధికారంలో ఉన్నా నాడు నేడు బీఆర్‌ఎస్‌కు ఒక్కో సీటే..
రాష్ట్రంలో రాజకీయ వాతావరణం అంతా ఒక రకంగా ఉంటే ఖమ్మం ఉమ్మడి జిల్లాలో అందుకు విరుద్ధంగా ప్రజల ఆలోచన తీరు ఉంటుందనడానికి గత కొన్ని దశాబ్దాలుగా వస్తున్న ఫలితాలను బట్టి తెలుస్తోంది. 2014 నుండి వరుసగా రెండు దఫాలు టీఆర్‌ఎస్‌ (బీఆర్‌ఎస్‌) ప్రభుత్వం సీఎం కేసీఆర్‌ సారధ్యంలో అధికారంలో ఉన్నా 2014, 2018 ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్కో సీటు మాత్రమే వచ్చింది. రాష్ట్రంలో అంతటా టీఆర్‌ఎస్‌ ప్రభంజనం ఉన్నా ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌, టీడీపీలను ప్రజలు గతంలో గెలిపించారు. అటువంటి భిన్నమైన రాజకీయ వాతావరణం ఉండే ఖమ్మం జిల్లాలో ఈ సారి బీఆర్‌ ఎస్‌ బహిష్కృత నేత, బలమైన ప్రజా బలం కల్గిన ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్‌లో చేరిక, ఉనికి కోసం బీజేపీ, కమ్యూనిస్టు నాయకుల పోటీ, విపక్షాలను ఎదుర్కొనేందుకు సీఎం కేసీఆర్‌ బలమైన వ్యూహంతో సాగనున్న నేపథ్యంలో జిల్లాలో రానున్న అసెంబ్లిd ఎన్నికలు రాజకీయ కురుక్షేత్రాన్ని తలపించనున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అభివృద్ధి నినాదంతో హ్యాట్రిక్‌ కోసం మంత్రి పువ్వాడ..
ఖమ్మం ఎమ్మెల్యేగా, బీఆర్‌ఎస్‌ కారు గుర్తుపై గెలిచి ఉమ్మడి జిల్లాకు ముఖ్యనేతగా ప్రాతినిథ్యం వహిస్తూ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ సారధ్యంలో అభివృద్ధి విజన్‌ను చాటుతూ.. నాడు.. నేడు అనే అభివృద్ధి నినాదంతో ముందుకు సాగుతున్నారు. నిరంతరం ప్రజలతో మమేకం అవుతూ జిల్లాలో అభివృద్ధి చేపడుతూ బహుముఖ వ్యూహ ంతో హ్యాట్రిక్‌ విజయం వైపు అడుగులు వేస్తున్నారు. ఖమ్మంలో మంత్రి పువ్వాడపై పోటీకి కాంగ్రెస్‌ నుండి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మహ్మద్‌ జావీద్‌, మువ్వా విజయ్‌బాబు పేర్లు వినబడుతుండగా, బీజేపీ నుండి పొంగులేటి సుధాకర్‌రెడ్డి, గల్లా సత్యనారాయణ, ఎర్నేని రామారావు పేర్లు వినిపిస్తున్నాయి. అభివృద్ధి నినాదంతో పాటు సీపీఎం, సీపీఐ పార్టీలు బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వనున్న నేపథ్యంలో ఖమ్మంలో మంత్రి పువ్వాడ హ్యాట్రిక్‌ విజయం ఖాయమనే అభిప్రాయాలు ఉన్నాయి. అదే రీతిలో పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావుతో పాటు బీఆర్‌ఎస్‌లో వలస ఎమ్మెల్యేలుగా చేరిన వారంతా వరుస విజయం కోసం అభివృద్ధి అస్త్రాన్ని ప్రయోగిస్తూ ప్రత్యర్ధి పార్టీలను ఎదుర్కొనేందుకు వ్యూహాలకు పదును పెడుతున్నారు.

గత ఎన్నికల్లో 9 సీట్లు గెలిపించిన భట్టి విక్రమార్క
మధిర అసెంబ్లిd నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ సీఎల్పీ నేతగా ఉన్న మల్లు భట్టి విక్రమార్క గత 2018 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా నుండి 9 ఎమ్మెల్యే సీట్లు గెలుపొందడంలో విశేషంగా కృషి చేశారు. ఖమ్మం నుండి బీఆర్‌ఎస్‌ పార్టీపై గెలుపొందిన పువ్వాడ అజయ్‌ కుమార్‌ను మినహాయిస్తే మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌, టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌, టీడీపీ కలిసి పనిచేయగా, పాలేరులో కందాల ఉపేందర్‌రెడ్డి, ఇల్లందులో బాణోత్‌ హరిప్రియా నాయక్‌, కొత్తగూడెంలో వనమా వెంకటేశ్వరరావు, పినపాకలో రేగా కాంతారావు, భద్రాచలంలో పోడెం వీరయ్య, సత్తుపల్లిలో సండ్ర వెంకట వీరయ్య(టీడీపీ), అశ్వారావుపే టలో మెచ్చా నాగేశ్వరరావు(టీడీపీ), వైరాలో స్వతంత్ర అభ్యర్ధిగా కాంగ్రెస్‌, టీడీపీల మద్దతుతో పోటీ చేసిన లావుడ్య రాములు నాయక్‌ గెలుపొందారు. ఈ నేపథ్యంలోనే భట్టి విక్రమార్కకు కాంగ్రెస్‌ అధిష్టానం సీఎల్పీ పదవిని కట్టబెట్టింది. కాల క్రమేణా భద్రాచలం ఎమ్మెల్యే పోడెం వీరయ్య మినహాయిస్తే మిగిలిన 8మంది ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌లో చేరడంతో జిల్లాలో ప్రస్తుతం ఎమ్మెల్యేల బలం బీఆర్‌ఎస్‌కు పెరిగిపోయింది. ఈ నేపధ్యంలో బీఆర్‌ఎస్‌ నుండి అందరి గెలుపు కష్టంగానే ఉండనుంది.

బీఆర్‌ఎస్‌లో స్వపక్షంలోనే విపక్ష రాజకీయం…
కాంగ్రెస్‌, టీడీపీల నుండి గెలిచిన వారు బీఆర్‌ఎస్‌లో చేరడం, బీఆర్‌ఎస్‌ నుండి పోటీ చేసినవారు అన్ని నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ పార్టీలోనే ఉండి ఆ పార్టీకి ప్రత్యామ్నాయంగా సీట్ల కోసం నిరీక్షిస్తుండడంతో ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్‌ అభ్యర్ధులు స్వపక్షంలోనే విపక్షం అన్నట్లు సొంత పార్టీ నుండే ప్రత్యర్ధులను ఎదుర్కోంటున్నారు. అటువంటి పరిస్థితి కాంగ్రెస్‌, టీడీపీలకు లేకపోవడంతో బీఆర్‌ఎస్‌ ఫలితాలపై సస్పెన్సు ఉంది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లాంటి వారికి బీఆర్‌ ఎస్‌లో ఎక్కడ సీటు ఇస్తారనే విషయంలో స్పష్టత లేకపోవడం, అదే పరిస్థితి ఖమ్మం మినహా ఇతర అన్ని నియోజకవర్గాల్లో ఉండడం ఆ పార్టీకి మైనస్‌ అంశాలుగా ఉన్నాయి.

బీఆర్‌ ఎస్‌ను ఓడించడమే లక్ష్యంగా పొంగులేటి
మాజీ ఎంపీ, బీఆర్‌ఎస్‌ బహిష్కృత నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్‌లోకి తన అనుచరగణంతో చేరనున్న నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ వాతావరణం మారిపోనుంది. ఖమ్మం సిట్టిం గ్‌ ఎంపీగా ఉండి కేసీఆర్‌ మాటలు నమ్మి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని బీఆర్‌ఎస్‌లో విలీనం చేస్తే తనకు సిట్టింగ్‌ సీటు ఇవ్వకపోగా, అన్యాయం చేశారని ఆయన రగిలిపోతూ బీఆర్‌ ఎస్‌ ఓటమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో భట్టి విక్రమార్క, రేణుకాచౌదరి గ్రూపు రాజకీయాలకు తోడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గ్రూపు రాజకీయం కొనసాగనున్న నేపధ్యంలో రానున్న అసెంబ్లిd ఎన్నికల ఫలితాలు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీల మధ్యనే ప్రధాన పోటీగా ఉండనున్నాయి.

ప్రాతినిధ్యం కోసం కమ్యూనిస్టుల పోరాటం
రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ కమ్యూనిస్టులతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉండడంతో బీఆర్‌ఎస్‌కు అది కలిసొచ్చే అంశంగా ఉంది. మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ కమ్యూనిస్టుల ఓటు బ్యాంకుతో విజయం సాధించిన నేపధ్యంలో రానున్న ఎన్నికల్లో కూడా అదే అస్త్రాన్ని ఉపయోగించాలని కేసీఆర్‌ భావిస్తుండగా, సీపీఎం, సీపీఐ పార్టీల నాయకత్వాలు కూడా అందుకు సుముఖంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. తమకు కొన్ని సీట్లు రావాలని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కోరుతూ ఇతర జిల్లాల్లో స్థానాలతో పాటు ఖమ్మం జిల్లాలో ఉన్న పాలేరు జనరల్‌ సీటు కోసం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం జనరల్‌ సీటు కోసం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కోరుతున్న సీట్లతో పాటు అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఉభయ కమ్యూనిస్టులను సీఎం కేసీఆర్‌ సర్దుబాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇల్లందులో సీపీఐ ఎంఎల్‌ ప్రజాపంథా నుండి గుమ్మడి నర్సయ్య కాని, ఆయన కూతురు కాని పోటీ చేసే అవకాశం ఉండగా, కమ్యూనిస్టులతో చెలిమి, సీట్ల సర్దుబాటు కేసీఆర్‌కు ముఖ్యమైన అంశంగా ఉండనుంది.

ఆధిపత్యం కోసం తుమ్మల, రేణుకాచౌదరి, సుధాకర్‌రెడ్డి
కేంద్రంలో, రాష్ట్రంలో ప్రాతినిధ్యం చాటుతున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (బీఆర్‌ఎస్‌), మాజీ కేంద్ర మంత్రి రేణుకాచౌదరి (కాంగ్రెస్‌), బీజేపీ జాతీయ నాయకులు డాక్టర్‌ పొంగులేటి సుధాకర్‌రెడ్డి తమ ప్రాతినిధ్యం చాటుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 2018 ఎన్నికలకు ముందు టీడీపీనీ వీడి టీఆర్‌ఎస్‌లో చేరిన తుమ్మల నాగేశ్వరరావుకు వెంటనే సీఎం కేసీఆర్‌ ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి పదవి కట్టబెట్టగా, పాలేరు నియోజక వర్గం నుండి మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి మరణం తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ కారు గుర్తుపై పోటీ చేసి గెలుపొంది మంత్రి పదవిలో కొనసాగారు. 2018 ఎన్నికల్లో ఆయన టీఆర్‌ఎస్‌ నుండి కారు గుర్తుపై ఓటమి చెందగా, మళ్ళీ పాలేరు ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆసక్తితో ఉన్నారు. వైఎస్‌ఆర్‌ తెలంగాణా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పాలేరు నుండి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండడంతో పాలేరు పోటీ ఆసక్తికరం కానుంది. బీజేపీ కూడా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇవ్వనుండగా, మొత్తం మీద ప్రస్తుతం కనిపిస్తున్న పరిణామాల మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న సిట్టింగు ఎమ్మెల్యేలకు రానున్న ఎన్నికల్లో గట్టి పోటీ తప్పదని, రాజకీయ కురుక్షేత్ర సంగ్రామంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీలకు మిశ్రమ ఫలితాలు ఉండవచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement