Saturday, April 27, 2024

మరోసారి జైలుకు వెళ్లేందుకు సిద్ధం: కేసీఆర్ కు బండి సంజయ్ వార్నింగ్

ఉద్యోగుల కోసం అవసరమైతే మళ్లీ జైలుకు వెళ్లేందుకు సిద్ధమని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. నిన్న రాత్రి కరీంనగర్ జిల్లా జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. ఉద్యోగుల బదిలీలకు సంబంధించి జీవో 317కి సవరణలు చేయాలని డిమాండ్ తో బండి సంజయ్ చేపట్టిన జాగరణ దీక్షలో కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారంటూ ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, హైకోర్టు ఆదేశాలతో ఆయన విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన సంజయ్ కు కేంద్ర సహాయ మంత్రి భగవంత్ కుభా, బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు.

తెలంగాణను దోచుకుంటున్న కేసీఆర్ ను వదిలే ప్రసక్తే లేదని బండి స్పష్టం చేశారు. వేల కోట్లు దోచుకుని అవినీతి కుబేరుడిగా మారాడని ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని జైలుకు పంపుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలో ఉంటే… కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉందనే విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. 317 జీవోను సవరించాలని మరోసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానని సంజయ్ చెప్పారు. ఉపాధ్యాయులు, ఉద్యోగుల కోసమే తాను జైలుకు వెళ్లానని… అవసరమైతే మళ్లీ జైలుకు వెళ్లేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. హక్కుల కోసం పోరాడే వారికి బీజేపీ అండగా ఉంటుందని బండి సంజయ్ చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement