Saturday, April 27, 2024

బెంగళూరులో దారుణం.. వృద్ధుడిని స్కూటీతో ఈడ్చుకెళ్లిన యువ‌కుడు

ఎక్కడ చూసినా రోజురోజుకు అరాచకాలు పెరిగిపోతున్నాయి. తాజాగా.. కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణం జరిగింది. ఓ యువకుడు తను చేసిన యాక్సిడెంట్‌ నుంచి తప్పించుకునేందుకు ఓ వృద్ధుడిని స్కూటీతోపాటు కొంతదూరం ఈడ్చుకెళ్లాడు. బెంగళూరులోని మగది రోడ్‌లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. మగది రోడ్డులో ఓ యువకుడు తన స్కూటీతో వృద్ధుడి వాహనాన్ని ఢీకొట్టాడు. దాంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

తర్వాత తప్పు తనదేనని గ్రహించిన యువకుడు తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దాంతో వృద్ధుడు స్కూటీని వదలకుండా వెనుక నుంచి గట్టిగా పట్టుకున్నాడు. అయినా, ఆ యువకుడు ఆగకుండా వృద్ధుడిని స్కూటీతో ఈడ్చుకెళ్లాడు. చివ‌ర‌కు ఆ రోడ్డులో వెళ్తున్న వాహనదారులు ఇది గమనించి తమ వాహనాలను అడ్డుపెట్టి స్కూటీని ఆపేశారు. సమాచారం అందుకున్న గోవిందరాజ్‌నగర్ పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడిని అరెస్ట్‌ చేశారు. గాయపడిన వృద్ధుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించారు. త‌ను చేసిన త‌ప్పుకు ఆ యువ‌కుడు వృద్దుడికి శిక్ష వేశాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement