Sunday, May 12, 2024

Telangana: మార్చి 3న శాసనసభా, 4న బడ్జెట్‌?.. రూ.1.50లక్షల కోట్లకు దగ్గరలో బడ్జెట్‌

శాసనసభా బడ్జెట్‌ సమావేశాలు 15 రోజులపాటు నిర్వహించేలా సర్కార్‌ ప్రణాళిక రూపొందిస్తోంది. మార్చి 1న శివరాత్రి పర్వదినం నేపథ్యంలో 3న సమావేశాలను ప్రారంభించాలని యోచిస్తోంది. ఈ ఏడాది రూ. 1.50లక్షల కోట్ల చేరువలో బడ్జెట్‌ అంచనాలను రూపొందిన ఆర్ధిక శాఖ అధికారులు సీఎం కేసీఆర్‌ ఆమోదం కోసం వేచిచూస్తున్నారు. ఈ మేరకు శాసనసభా సమావేశాల నిర్వహణకు వీలుగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 3న సమావేశాలను ప్రారంభించి 4న బడ్జెట్‌ను ప్రవేవపెట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు.

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: అసెంబ్లీ సమావేశమైన తొలిరోజు ఉభయసభలనుద్దేశించి గవర్నర్‌ ప్రసంగం తర్వాత బీఏసి సమావేశంలో శాసనసభా పనిదినాలను నిర్ణయించనున్నారు. ఈలోగా సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై టీఆర్‌ఎస్‌ ఎల్పీ సమావేశం సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన నిర్వహించాలని భావిస్తున్నారు. బడ్జెట్‌ సమావేశాలకు ముందే టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ శాసనసభ్యులతో భేటీ కానున్నారు. ఈ మేరకు సభ్యులకు సమాచారం ఇందించనున్నారు. అసెంబ్లీలో వ్యవహరించాల్సిన తీరు, ప్రతిపక్షాలను ఎదుర్కొనే అంశాలతోపాటు, ప్రభుత్వ పథకాలపై శాసనసభా వేదికగా ప్రజల్లోకి వెళ్లేలా అనుసరించాల్సిన వ్యూహాలను సీఎం కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు. గత బడ్జెట్‌ సమావేశాలను కూడా కోవిడ్‌ నేపథ్యంలో తక్కువ పనిదినాలతో ముగించారు. ఈ నేపథ్యంలో ఎక్కువ పనిరోజులు సభ నిర్వహించాలని సర్కార్‌ భావిస్తోంది. అన్ని పద్దులపై సవివరమైన చర్చతోపాటు, ప్రతీ అంశాన్ని చర్చించాలని సర్కార్‌ భావనగా ఉంది. ఈ ఏడాది సాగునీటిరంగానికి కేటాయింపులు తగ్గించి విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమ రంగాలకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలని భావిస్తోంది. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టు అవసరాలకు మంజీర లిఫ్ట్‌ ఇరిగేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ను సమావేశాల్లో ఆమోదించి ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రతీ అసెంబ్లిd సెగ్మెంట్‌లో 100 మందికి తగ్గకుండా లబ్దిదారులకు దళితబంధు పథకం వర్తించేలా భారీగా నిధులను కేటాయించనున్నారు. అదేవిధంగా బీసీలు, రైతులకు రెండు కొత్త పథకాలను సీఎం కేసీఆర్‌ ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఇప్పటికే అచిర కాలకంలోనే తెలంగాణ రాష్ట్రం ప్రజా సంక్షేమం, వ్యవసాయం, పరిశ్రమలు, పెట్టుబడుల సాధన వంటి రంగాల్లో ముందంజలో ఉంది. ఆర్ధిక క్రమశిక్షణ, ఆర్ధిక నిర్వమణలో దేశంలోనే తొలి స్థానంలో నిల్చింది. ఈ నేపథ్యంలో 2022-23 వార్షిక బడ్జెట్‌కు ఇవన్నీ చోధక శక్తులగా నిలవనున్నాయి. అప్పుల్లో బీజేపి పాలిత రాష్ట్రాలకంటే తెలంగాణ అదుపులోనే ఉందని, ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలులో ఎక్కడా వెనుకడుగు వేయలేదని ప్రస్తుత బడ్జెట్‌ ఘనాంకాల సవరించిన అంచనాలు ప్రస్తుటం చేస్తున్నాయి. రుణాలు పొందడంలో తెలంగాణ అనేక పెద్ద రాష్ట్రాల తర్వాతే 9వ స్థానంలో ఉంది. ఆర్ధిక నిర్వహణలో దేశంలో గుజరాత్‌, కర్నాటకలకంటే ముందువరుసలోకి తెలంగాణ వచ్చి చేరింది. రాష్ట్ర రుణ-స్థూల జాతీయోత్పత్తి నిష్పత్తి(జీఎస్డీపీ) దేశంలోనే తక్కువగా నమోదైంది. జీఎస్డీపీలో సగటు అప్పు 16.1శాతంగా నమోదైంది. ఇది ఆతర రాష్ట్రాలకంటే అత్యల్పంగా ఉంది. రెవెన్యూ రాబడిలో రాష్ట్రం సొంత ఆదాయ వనరుల్లో పురోగతి పుంజుకున్నది. రాష్ట్ర ఆవిర్భావం సమయంలో 11వ ర్యాంకు ఉండగా ఇది ఇప్పుడు 6వ ర్యాంక్‌కు చేరింది. ఓపెన్‌ మార్కెట్‌ రుణ సేకరణలో తెలంగాణ 9వ స్థానంలో ఉంది.

బడ్జెట్‌ అంచనాలకు ఈ లెక్కలన్నీ కీలకంగా మారాయి. రుణాల్లో అనేక అభివృద్ధి చెందిన రాష్ట్రాలకంటే తక్కువ మొత్తాల్లోనే ఉండగా, ర్యాంకుల్లో తెలంగాణ ముందు వరుసలో నిల్చింది. వీటన్నింటినీ గుర్తించిన ప్రభుత్వం వచ్చే ఆర్ధిక ఏడాది బడ్జెట్‌ను ఐదేళ్ల ప్రగతి ముందు చూపుతో రూపొందిస్తోంది. సంపదను పెంచి ప్రజలకు పంచే లక్ష్యంతో అనేక ప్రణాళికలను అమలు చేయాలని సంకల్పించింది. బడ్జెట్‌ పద్దు తుది దశకు చేరగా, శాసనసభా ప్రారంభాలకు నోటిఫికేషన్‌ జారీ తర్వాత మంత్రివర్గం ఆమోద ముద్ర వేయనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement