Sunday, May 5, 2024

Big Story: అంచనాలను మించి పోరాటం.. రష్యాను దీటుగా ఎదుర్కొంటున్న ఉక్రెయిన్​

రష్యా ఉక్రెయిన్‌పై సైనిక చర్య చేపడుతున్నట్టు ప్రకటించిన కొన్ని గంటల్లో దేశాన్ని ఆక్రమిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ, పరిస్థితులు అందుకు విరుద్ధంగా కనిపిస్తున్నాయి. నాలుగు రోజులుగా ఉక్రెయిన్‌ సైన్యం రష్యాతో పోరాటం చేస్తూనే ఉంది. ఎక్కడికక్కడ రష్యా సైన్యాన్ని నిలువరిస్తోంది. ఇప్పుడు ఇదే ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. భారీ విధ్వంసకర ఆయుధాలు, సైన్యమున్న రష్యా రెండో రోజే చర్చలకు పిలుపునివ్వడం అందరినీ ఆలోచనల్లో పడేసింది. కొన్ని వీడియోలు చూస్తుంటే భీకరంగా పోరాటం జరుగుతున్నట్టు కనిపిస్తోంది.

ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ఈనెల 24న చేపట్టింది. ఉక్రెయిన్​కు మూడు దిక్కుల నుంచి వారి దండు దూసుకొస్తోంది. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ స్వాధీనమైనట్టు రెండో రోజే రష్యా ప్రకటించింది. కానీ, ఇప్పటికీ రష్యా సైన్యం కీవ్‌ శివారుల్లోనే ఉంది. భూ, గగనతల దాడులకు దిగుతున్నా ఉక్రెయిన్‌ సైన్యం వారికి దీటుగా రిప్లయ్​ ఇస్తోంది. ఎక్కడా తగ్గకుండా రష్యా యుద్ధ విమానాలు, ఫైటర్​ జెట్లను కూల్చి పడేస్తోంది. ఒక్క రోజులోనే పనైపోతుందని భావించిన రష్యాకు చుక్కలు చూపిస్తోంది. యాంటీ ట్యాంకులు, స్టింగర్‌ శ్రేణి క్షిపణులు, జావెలిన్‌ క్షిపణులతో రష్యా దాడులను తిప్పికొడుతోంది. నాలుగో రోజు కూడా రష్యాకు ఉక్రెయిన్‌ సమాధానమిస్తోంది. అందుకు కారణం వివిధ దేశాలు సరఫరా చేస్తున్న ఆయుధాలే.

ఉక్రెయిన్‌పై దాడికి దిగిన రష్యాపై పలు దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నేరుగా సైనిక సాయం చేయక పోయినప్పటికీ పలు దేశాలు ఆర్థిక, ఆయుధ సాయానికి ముందుకొచ్చాయి. తాజాగా జర్మనీ వెయ్యి యాంటీ ట్యాంకులు, 500 స్టింగర్‌ శ్రేణి క్షిపణులను సరఫరా చేసింది. బెల్జియం 2వేల మెషిన్‌ గన్నులను ఉక్రెయిన్‌కు తరలించింది. ఇక డచ్‌ ప్రభుత్వం స్నిప్పర్‌ రైఫిల్స్‌, 200 స్టింగర్‌ శ్రేణి క్షిపణులను పంపింది. అలాగే చెక్‌ రిపబ్లిక్‌ 30వేల తుపాకులు, 7వేల అసాల్ట్ రైఫిళ్లు, 3వేల మిషన్‌ గన్నులు, డజన్ల కొద్దీ స్నిప్పర్‌ గన్స్‌, పది లక్షల కార్ట్‌రిడ్జులను తరలించింది.

ఇక అమెరికా 350 మిలియన్‌ డాలర్ల సాయయం ప్రకటించింది. ఇప్పటికే భారీ సంఖ్యలో జావెలిన్‌ క్షిపణులను తరలించింది. ఈ ఆయుధాలతో ఉక్రెయిన్ సైన్యం నాలుగో రోజు కూడా పోరాట పటిమను ప్రదర్శించింది. అయితు యుద్ధం ఇప్పుడు ముగిసిపోదని, మరికొన్ని రోజులు కొనసాగే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికైనా యుద్ధాన్ని ఆపి శాంతికి కృషి చేయాలని పలు దేశాలు కోరుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement