Thursday, May 23, 2024

TS | పోలీసుల త‌నిఖీల్లో రూ.2 కోట్ల మద్యం పట్టివేత..

హైదరాబాద్‌,ఆంధ్రప్రభ : మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌లో పోలీసుల తనిఖీలలో రూ.2 కోట్ల మద్యం పట్టుబడింది. సేంద్రీయ ఎరువులు తీసుకెళ్తున్న వాహనంలో మధ్యలో మద్యం బాటిళ్లు పెట్టి తరలిస్తుండగా బాలానగర్‌ చౌరస్తాలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కాగా ఈ మద్యం గోవా రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌ ప్రాంతం రాజమండ్రికి తరలిస్తున్నట్లు పోలీసుల ప్రాధమిక విచారణలో తేలింది. లారీలో 80 శాతం మేరకు మందు కాటన్‌లు నింపి పోలీసులు గుర్తించకుండా మిగతా భాగంలో వర్మి కంపోస్ట్‌ నింపారు. లారీలో రాయల్‌ క్వీన్‌ 1200 కాటన్‌లు, రాయల్‌ బ్లూ 800 కాటాలు ఉన్నాయని పోలీసు అధికారులు తెలిపారు.

కాటన్‌లో 48 సీసాల ఉన్నాయని మహబూబ్‌నగర్‌ జిల్లా డీఎస్పీ వెంకటేశ్వర్లు మీడియాకు వివరాలు వెల్లడించారు. పట్టుబడ్డ మద్యం మొత్తం రూ.2,07,36,000 విలువ ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని మిగిలిన వివరాలను త్వరలో వెల్లడిస్తామని డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు.

- Advertisement -

వేర్వేరు ప్రాంతాల్లో..

ఎన్నికల సమీపిస్తున్న సమయంలో మద్యం రవాణాపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈక్రమంలో సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం రేవూరు గ్రామ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న రూ. 10 లక్షల రూపాయల విలువైన మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. కోదాడకు చెందిన ఒక వైన్‌షాప్‌ నుంచి మినీ వ్యాన్‌లో ఆంధ్రప్రదేశ్‌కు తరలిస్తున్న 119 కాటన్ల మద్యాన్ని పక్కా సమాచారం మేరకు పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.

అలాగే వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట శివారు డీసీ తండా చెక్‌పోస్ట్‌ వద్ద ఎలాంటి ఆధారాలు లేకుండా కారులో తరలిస్తున్న నాలుగు లక్షల రూపాయలను పోలీసులు సీజ్‌ చేశారు. వరంగల్‌ జిల్లాలో ఎన్నికల కోడ్‌ దృష్ట్యా మద్యం దుకాణాలను ఆబ్కారీ అధికారులు సీజ్‌ చేశారు. నిబంధనల మేరకు వైన్‌షాపులు మూసివేసినట్లు తెలిపారు. వర్ధన్నపేటలో ఓ మద్యం దుకాణం సీజ్‌ చేసే క్రమంలో అధికారులు, మద్యంప్రియులకు మధ్య వాగ్వాదం చోటు-చేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement