Saturday, April 27, 2024

ఏలూరు కార్పోరేషన్ ఫలితాలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్…

ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ లెక్కింపునకు ధర్మాసనం అనుమతించింది. ఎస్‌ఈసీ ఇచ్చిన కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ లెక్కింపునకు అనుమతులిచ్చింది.

ఏలూరు కార్పోరేషన్ ఎన్నికల్లో బలవంతంగా నామినేషన్లు ఉపసంహరింపజేశారని ఎన్నికలు వాయిదా వేయాలని  మార్చి 8న దాఖలైన పిటిషన్ పై ఎన్నికలను నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశించింది. అయితే ఈ విషయమై ఏపీ సర్కార్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై  ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ ఎన్నికల ఫలితాలను మాత్రం వెల్లడించవద్దని ఈ ఏడాది మార్చి 9న ఆదేశించింది. ఏలూరు కార్పోరేషన్ లో 50 డివిజన్లున్నాయి. వీటిలో 3 స్థానాలను వైసీపీ ఏకగ్రీవంగా కైవసం చేసుకొంది. 47 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది. ఏలూరు కార్పోరేషన్ లో ఫలితం ఎలా ఉంటుందనే విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

కాగా, మార్చి 10న ఏలూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అత్యంత కట్టుదిట్టమైన భద్రత, కోవిడ్‌ జాగ్రత్తల మధ్య జరిగిన ఈ ఎలక్షన్‌లో  56.86% పోలింగ్ నమోదైంది. గత ఏడాది జనవరిలో చొదిమెళ్ల, కొమడవోలు, వెంకటాపురం, పోణంగి, సత్రంపాడు, శనివారపుపేట, తంగెళ్లమూడి పంచాయతీలను కార్పొరేషన్‌ లో విలీనం చేస్తూ వార్డుల పునర్విభజన జరిగింది. అయితే, విలీనం సమయంలో ఓటర్ల జాబితాలో తప్పులు నమోదయ్యాయని.. అలాగే రిజర్వేషన్ల కేటాయింపుల్లోనూ ఇబ్బందులున్నాయని ఏలూరుకు చెందిన చిరంజీవి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఓటర్ల జాబితాలో పొరబాట్లు, రిజర్వేషన్లలో చోటు చేసుకున్న తప్పులను సవరించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని హైకర్టు స్పష్టం చేసింది. దీనిని ప్రభుత్వం, ఎస్ఈసీ సవాల్ చేయగా.. ఎన్నికల నిర్వహణకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అనంతరం కార్పొరేషన్ ఎన్నికలకు ఎన్నికలు నిర్వహించారు. మార్చి 10న ఎన్నికలు నిర్వహించవచ్చన్న హైకోర్టు డివిజనల్ బెంచ్.. ఫలితాలను మాత్రం ప్రకటించవద్దని స్పష్టం చేసింది. తాజాగా ఇప్పుడు ఏలూరు కార్పొరేషన్‌ ఎన్నికల కౌంటింగ్‌కు హైకోర్టు అనుమతినిచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement