Friday, April 26, 2024

ప్లాస్మా థెరపీని ఇకపై ఉండదు: ICMR

కరోనా సోకిన బాధితులకు అత్యవసర వైద్య చికిత్సలో ఉపయోగించే ప్లాస్మా థెరపీని కరోనా ప్రోటోకాల్‌ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది ఐసీఎంఆర్‌. కొవిడ్ ప్రోటోకాల్ టాస్క్ ఫోర్స్, వైద్యారోగ్యశాఖ, ఎయిమ్స్, ఐసీఎంఆర్ సంయుక్తంగా ప్రకటించి, ఉత్తర్వులు జారీ చేశాయి. దీంతో ఇకపై కరోనా చికిత్సలో వినియోగించే ప్లాస్మా థెరపీ నిలిచిపోనుంది. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తులు కొద్ది రోజుల ద్వారా ప్లాస్మా దానం చేస్తుండగా.. పరిస్థితి విషమంగా ఉన్న బాధితులకు ఇచ్చేవారు. తద్వారా రోగి శరీరంలో యాంటీబాడీలు తయారై కరోనాను అడ్డుకుంటాయని పలువురు వైద్యులు పేర్కొన్నారు. అయితే, ప్మాస్మా థెరపీ వల్ల మరణాలను అడ్డుకోలేమని, పెద్ద ఉపయోగం లేదని ఐసీఎంఆర్ గతంలోనే పేర్కొంది.

ఇదిలా ఉండగా.. ఒక వేరియంట్‌ వైరస్‌ సోకిన బాధితులకు మరో వేరియంట్‌ కరోనా సోకిన బాధితుల ప్లాస్మా ఇవ్వడంతో కొత్త మ్యుటేషన్లు వచ్చే ముప్పు ఉందని హెచ్చరిస్తున్నా.. విచ్చలవిడిగా ప్లాస్మా చికిత్స చేస్తున్నారంటూ కొద్దిరోజుల క్రితం పలువురు శాస్త్రజ్ఞులు కేంద్ర ప్రభుత్వ ముఖ్య శాస్త్రీయ సలహాదారు విజయరాఘవన్‌కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. దీనికి తోడు.. బ్రిటన్‌లో జరిగిన ఒక అధ్యయనంలో కూడా ప్లాస్మా చికిత్సతో పెద్దగా ప్రభావం ఉండదని తేలింది. గత ఏడాది మనదేశంలో 400 మంది రోగులపై ఐసీఎంఆర్‌-ప్లాసిడ్‌ ట్రయల్స్‌ నిర్వహించగా.. ఇదే తేలింది. ప్రస్తుతం ఉన్న మార్గదర్శకాల ప్రకారం.. లక్షణాలు కనిపించిన ఏడు రోజుల్లోపు.. అది కూడా హైటైటర్‌ డోనర్‌ దొరికితే.. ‘ఆఫ్‌ లేబుల్‌’ ప్లాస్మా థెరపీకి అవకాశం ఉంది. ‘ఆఫ్‌ లేబుల్‌’ అంటే.. అనుమతి లేకున్నా అత్యవసర సమయంలో ఈ చికిత్స చేయవచ్చు. కానీ, చికిత్సతో ప్రభావం లేదని తేలిన నేపథ్యంలో నిలిపివేస్తూ ఐసీఎంఆర్‌ కీలక నిర్ణయాన్ని తీసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement