Wednesday, May 22, 2024

మ‌ళ్లీ ఆందోళ‌న బాట‌లో రెజ్ల‌ర్లు – క‌న్నీళ్లు పెట్టుకున్న ఫొగట్, సాక్షి మాలిక్

న్యూఢిల్లీ- భారత్‌కు అంతర్జాతీయ వేదికపై ఎన్నో పతకాలు సాధించి పెట్టిన టాప్ రెజ్లర్లు ఢిల్లీలో మళ్లీ ఆందోళనకు దిగారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్, ఇతర ట్రైనర్ల నుంచి మహిళా రెజ్లర్లకు ఎదురవుతున్న లైంగిక వేధింపులపై కొన్ని వారాల క్రితం వారు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ప్రభుత్వం నుంచి పలు హామీలు రావడంతో అప్పట్లో వారు ఆందోళనను విరమించారు. అయితే, ఇప్పటికీ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్, ఇతర ట్రైనర్లపై చర్యలు తీసుకోకపోవడంతో విసుగెత్తిపోయిన టాప్ రెజ్లర్లు మళ్లీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు దిగారు. తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడే తింటాం, ఇక్కడే నిద్రపోతాం అని రెజ్లర్లు స్పష్టం చేశారు. అంతేకాదు, వారు పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం గమనార్హం. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై సెంట్రల్ ఢిల్లీలోని కన్నాట్ ప్రాంత పోలీస్ స్టేషన్ లో లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ ఏడుగురు మహిళా రెజ్లర్లు ఫిర్యాదు చేశారు.


తాము కొన్ని వారాల క్రితం పోరాటం చేసినప్పటికీ ప్రభుత్వ ప్యానెల్ రిపోర్టు ఇప్పటికీ ప్రజల ముందు పెట్టలేదని రెజ్లర్ సాక్షీ మాలిఖ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా రెజ్లర్ల నుంచి స్టేట్ మెంట్ ను రికార్డు చేశారని, దాన్ని ప్రజల ముందుకు పెట్టాలని డిమాండ్ చేశారు. ఇది చాలా సున్నితమైన అంశమని, ఫిర్యాదు చేసిన వారిలో ఓ మైనర్ కూడా ఉందని చెప్పారు.ఫిర్యాదు చేసిన వారి పేర్లు లీక్ కాకుండా చూడాలని అన్నారు. బ్రిజ్ భూషణ్ ను అరెస్టు చేసే వరకు ఇక జంతర్ మంతర్ నుంచి కదిలే ప్రసక్తే లేదని రెజ్లర్ భజరంగ్ పూనియా చెప్పారు. రెజ్లర్ విఘ్నేశ్ ఫొగట్, సాక్షి మాలిక్ మీడియాతో మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement