Monday, May 13, 2024

INDvsENG 1st Test | త‌డ‌బ‌డిన టీమిండియా.. ఉప్ప‌ల్ ఓటమి !

హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియాకు షాక్ తగిలింది. ఇంగ్లాండ్ జట్టుపై 28 పరుగుల తేడాతో భారత్ ఓటమిని చవిచూసింది. దీంతో ఐదు మ్యాచుల ఈ టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లాండ్ 1-0 ఆధిక్యంతో నిలిచింది. కాగా, మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగులు చేయగా భారత్ 436 పరుగులు చేసింది. దీంతో భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 190 పరుగుల ఆధిక్యత లభించింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ బ్యాటర్ ఓలీ పోప్ 196 పరుగులతో చెలరేగాడు. ఆ ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ జట్టు 420 పరుగులకు ఆలౌట్ అవ్వగా భారత్ ముందు 231 పరుగుల టార్గెట్ నిలిచింది.

రెండో ఇన్నింగ్స్‌లో భారత ఓపెనర్లు రోహిత్ శర్మ 39, యశస్వి జైస్వాల్ 15 పరుగులు చేశారు. ఆ తర్వాత వచ్చిన శుభ్‌మన్ గిల్ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ 22, అక్షర్ పటేల్ 17 పరుగులు మాత్రమే చేయగలిగారు. ఈ నాలుగు వికెట్లను ఇంగ్లాండ్ బౌలర్ టామ్ హార్ట్లీ పడగొట్టాడు. ఇంగ్లాండ్ బౌలర్లు విజృంభించడంతో భారత్ 117 పరుగులకే 7 వికెట్లను కోల్పోయింది. దీంతో విజయం సాధిస్తామనే ఆశలు సన్నగిల్లాయి.

ఆ తర్వాత గ్రౌండ్ లోకి వచ్చిన రవిచంద్రన్ అశ్విన్, కేఎస్ భరత్ కాసేపు స్కోరును ముందుకు నడిపించారు. వారిద్దరూ కలిసి ఎనిమిదో వికెట్‌కు 57 పరుగులు మాత్రమే చేయగలిగారు. ఇక ఆఖరికి 202 పరుగులకే భారత్ కుప్పకూలడంతో 28 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ విజయం సాధించింది. ఇంగ్లాండ్ బౌలర్లలో టామ్ హార్ట్లీ 7 వికెట్లు తీయగా జో రూట్, జాక్ లీచ్ చెరో వికెట్‌ను పడగొట్టారు. మరోవైపు ఉప్పల్ స్టేడియంలో భారత్ ఓటమిపాలవ్వడంతో అభిమానులు నిరాశ చెందారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement