Friday, April 26, 2024

’ఓం న‌మః శివాయ‘ అంటూ జాగారం చేసేది ఇందుకే..

శివుడు… భోళా శంకరుడు. శివుడు… భక్తవ శంకరుడు. పత్రం పుష్పం ఫలం తోయం…. వీటిలో ఏది సమర్పించినా స్వీకరిస్తాడు. భక్తి శ్రద్ధలతో తనను కొలిచే ఆశ్రితులను ఆనందంగా అనుగ్రహిస్తాడు. జన్మానికో శివరాత్రి అంటారుగాని మహాశివరాత్రి పర్వదినం ఏటేటా వస్తూనే వుంటుంది. మనస్సులో నిద్రాణమైన భక్తిని జాగృతం చేస్తూనే వుంటుంది. త్రిమూర్తులలోనే కాదు సమస్త దేవతలలోనూ శివుడు భక్త సులభుడు. అందుకే ఆయనను భోళా శంకరుడని అంటారు. శంకరుడు భక్తవ శంకరుడు. అమృతం కోసం దేవదానవులు క్షీరసాగర మధనం చేసే సందర్భంలో తొలుత హాలాహలం పుట్టింది. దాన్ని అలాగే విడిచిపెడితే అది ముల్లోకాలను దహించివేసే ప్రమాదం వుండడంతో దేవదానవులందరూ భీతావహులయ్యారు. హాలాహలం బారినుండి లోకాలను రక్షించాలంటూ మహాదేవుడైన శంకరుడిని శరణు వేడారు. లోక రక్షణ కోసం ఆ గరళాన్ని తానే మ్రింగి గొంతులో బంధించి గరళ కంఠుడయ్యాడు. హాలాహల ప్రభావానికి ఆయన కంఠం కమిలి నీలంగా మారడంతో నీలకంఠుడిగా పేరు పొందాడు. గరళాన్ని గొంతులో బంధించడం వల్ల అది శివుడిలో విపరీతమైన తాపాన్ని పుట్టించసాగింది. ఆ తాపాన్ని తగ్గించుకోవడానికి క్షీరసాగర మధనంలో పుట్టిన చంద్రుని తలపై వుంచుకున్నాడు. నిరంతర తాపోపశమనం కోసం గంగమ్మను కూడా నెత్తిన పెట్టుకున్నాడు. అయినా శివుణ్ణి హాలాహల తాపం ఇబ్బంది పెడుతూనే వుంటుందట. అందుకే భక్తులు నిత్యం శివలింగానికి అభిషేకం చేస్తూ వుంటారు.

హాలాహలం మ్రింగినపుడు దాని ప్రభావానికి శివుడు మూర్ఛిల్లాడట. ఆందోళన చెందిన దేవతలు శివుడికి మెళకువ వచ్చేంత వరకు జాగారం చేశారు. అందుకే ఏటా మాఘ బహుళ చతుర్ధశి నాడు వచ్చే మహాశివరాత్రి రోజున భక్తులు ఉపవాసం చేసి జాగారం వుంటారు. జాగారం వున్న సమయంలో శివ పంచాక్షరి జపిస్తూ శివనామ సంకీర్తనతోనూ, జపధ్యానాలతోనూ కాలక్షేపం చేస్తారు. ఇదంతా మహా శివరాత్రి పర్వదినానికి గల పౌరాణిక నేపథ్యం. శివుడు అభిషేకప్రియుడు. ఆయన ఎటువంటి ఆడంబరాలు నైవేద్యాలు కోరుకోడు. భక్తితో దోసెడు నీళ్ళు తనపై పోస్తే భక్తిపారవశ్యంతో తన్మయత్వం చెందుతాడు. శివరాత్రి రోజున ఓం నమ:శ్శివాయ అనే పంచాక్షరిని జపించి మహాదేవుని కటాక్ష వీక్షణాలు పొందుదాం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement