Wednesday, May 8, 2024

క్రీడల్లో కుల,మత, లింగ బేధాల్లేవు.. ఎంపీ బీద మస్తాన్ రావు ప్రశ్నకు కేంద్రం సమాధానం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర స్థాయి క్రీడలు, ఈవెంట్లలో పాల్గొనే క్రీడాకారుల కుల ఆధారిత సమాచారాన్ని తాము సేకరించమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌తో కలిపి మొత్తం 189 కేంద్రాలను ఏర్పాటు చేసిందని, వాటిలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా శిక్షణా కేంద్రాలు, విస్తరణ కేంద్రాలు, క్రీడా ప్రోత్సాహక పథకాల అమలు కేంద్రాలు ఉన్నాయని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ డా. బీద మస్తాన్ రావు రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు బదులిస్తూ 28 క్రీడల్లో 8,119 ప్రతిభావంతులైన క్రీడాకారులు (4,973 మంది పురుషులు మరియు 3,146 మంది మహిళలు) రెసిడెన్షియల్, నాన్-రెసిడెన్షియల్ ప్రాతిపదికన శిక్షణ పొందుతున్నారని తెలియజేశారు.

దేశమంతటా ‘ఖేలో ఇండియా’ పథకం కింద 2,745 మంది అథ్లెట్లుకు (1,371 మంది పురుషులు మరియు 1,374 మంది మహిళలు) టాలెంట్ సెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కాంపోనెంట్ కింద కేంద్ర ప్రభుత్వం మద్ధతిస్తోందని వెల్లడించారు. క్రీడలలో ప్రవేశం కోసం అందరికీ అవకాశాలు ఉంటాయని, ఏ దశలోనూ లింగం, కుల, వర్గ మత బేధాలు, వివక్ష ఉండదని స్పష్టం చేశారు. దేశంలో గత ఐదేళ్లలో క్రీడల నిర్వహణలో కుల ఆధారిత హింస లేదా వివక్షకు సంబంధించిన సందర్భాలు లేవని, అటువంటివేమీ తమ దృష్టికి రాలేదని స్పష్టం చేసారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement