Saturday, May 4, 2024

నెల్లూరులో సైనిక్ స్కూల్ మంజూరు.. అదానీ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఏర్పాటు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో సైనిక్ స్కూళ్లను ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసేందుకు భారత రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరుతో పాటు బిహార్, గుజరాత్, హర్యానా, కర్నాటక, కేరళ, మహారాష్ట్రలో ప్రైవేట్ భాగస్వామ్యంతో సైనిక్ స్కూళ్లు మంజూరయ్యాయి. దేశవ్యాప్తంగా 100 సైనిక్ స్కూళ్లను ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా మొదటి విడతలో 12 సైనిక్ స్కూళ్లకు రక్షణ శాఖ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఇందులో 9 స్కూళ్లలో ఆగస్టు 1 నుంచి తరగతులు ప్రారంభమయ్యాయి. కర్నాటకలోని మరొక పాఠశాలలో సెప్టెంబర్ 6 నుంచి తరగతులు మొదలవుతాయి. మిగిలిన 2 గ్రీన్‌ఫీల్డ్ పాఠశాలల నిర్మాణ పనులు జరుగుతున్నందున, వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతులు మొదలవుతాయని రక్షణ శాఖ ప్రకటనలో పేర్కొంది.

2వ విడతలో భాగంగా మరొక 7 పాఠశాలలకు రక్షణ శాఖలోని సైనిక్ స్కూల్స్ సొసైటీ ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకుంది. కొత్తగా మంజూరైన సైనిక్ స్కూళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లాలో మంజూరైన సైనిక్ స్కూల్‌ను ‘అదానీ కమ్యూనిటీ ఎంపవర్మెంట్ ఫౌండేషన్’ భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్నట్టు రక్షణశాఖ ప్రకటించింది. మిగతా రాష్ట్రాల్లో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో స్కూళ్లు ఏర్పాటు కానున్నాయి. కొత్తగా మంజూరైన సైనిక్ స్కూళ్లలో ఈ నెలాఖరు నాటికి కార్యాకలాపాలు ప్రారంభమవుతాయని రక్షణశాఖ వెల్లడించింది. సైనిక్ స్కూళ్లలో ఏ మాదిరిగానైతే అడ్మిషన్లు జరుగుతాయో, అదే మాదిరిగా కొత్తగా మంజూరైన సైనిక్ స్కూళ్లలోనూ చేరికలు ఉంటాయని రక్షణ శాఖ పేర్కొంది. ఆలిండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా 40 శాతం సీట్ల భర్తీ జరుగుతుందని, మిగతా 60 శాతం సీట్లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించే ప్రవేశ పరీక్ష ఆధారంగా భర్తీ చేస్తామని వివరించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement