Tuesday, May 14, 2024

TS | హెల్త్‌ హబ్‌గా తెలంగాణ.. గ్లోబల్‌ సిటీగా హైదరాబాద్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ హెల్త్‌ హబ్‌గా వేగంగా వృద్ధి చెందుతోందని అదే సమయంలో హైదరాబాద్‌ గ్లోబల్‌ సిటీగా ఎదిగిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. సీఎం కేసీఆర్‌ మార్గనిర్దేశకత్వంలో హైదరాబాద్‌ శరవేగంగా అభివృద్ధి చెందిందని, ఆరోగ్యరంగంలోనూ ఎన్నో మైలురాళ్లను అధిగమించిందన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారని, ఆరోగ్యాన్ని మించిన సంపద లేనేలేదని తేల్చి చెప్పారు. ఈ మేరకు హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ లో ఆదివారం లిటిల్‌ స్టార్స్‌ అండ్‌ షీ ప్రైవేట్‌ ఆసుపత్రిని ప్రముఖ దర్శకుడు ఎన్‌ఎస్‌. రాజమౌళితో కలిసి ప్రారంభించారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 10వేల సూపర్‌ స్పెషాలిటీ పడకలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. నీతి ఆయోగ్‌ నివేదిక ప్రకారం దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. సూపర్‌ స్పెషాలిటీ ఎంసీహెచ్‌లను గాంధీ, నిమ్స్‌ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. వచ్చే నెలలో గాంధీలో సూపర్‌ స్పెషాలిటీ ఎంసీహెచ్‌ ప్రారంభం కానుందన్నారు. కార్పోరేటు ఆసుపత్రులతో తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రులు దవాఖానాలు పోటీపడుతున్నాయన్నారు. 2014లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు 30శాతం ఉంటే గత నెల 70శాతానికి చేరాయన్నారు. అవయవమార్పిడి శస్త్ర చికిత్సల్లో తెలంగాణ దేశంలో మొదటిస్థానంలో నిలిచిందన్నారు.

రక్త హీనతను తగ్గించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా జూన్‌ 14 నుంచి కేసీఆర్‌ న్యూట్రీషియన్‌ కిట్లను అందించబోతున్నట్లు తెలిపారు. మాతా శిశు మరణాలు తగ్గించడంలో తెలంగాణ దేశంలో నంబర్‌ 1 అని, 100శాతం ఆసుపత్రిలో డెలివరీలు జరుగుతున్నాయన్నారు. అనవసర సీ సెక్షన్లు తగ్గించడంలో ప్రయివేటు ఆసుపత్రులు తోడ్పాడు అందించాలని పిలుపునిచ్చారు. అనవసర సీ సెక్షన్లతో అనేక ఇబ్బందులు ఉంటాయని, నాడు పేదలు రొట్టెలు తింటే ధనికులు అన్నం తిన్నారని నేడు సీన్‌ రివర్స్‌ అయిందన్నారు.

- Advertisement -

లిటిల్‌స్టార్స్‌ ఆసుపత్రిలో ప్రజలకు తక్కువ ఖర్చుతో మంచి వైద్య సేవలు అందించాలని నిర్వాహకులకు సూచించారు. ప్రముఖ దర్శకుడు రాజమౌలిని పొగిడిన మంత్రి హరీష్‌రావు తెలుగుజాతి ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేశారని కొనియాడారు. బాహుబలితో కీర్తి దేశవ్యాప్తంగా వ్యాపిస్తే ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో ప్రపంచ వ్యాప్తమైందన్నారు. ఆస్కార్‌ సాధించినందుకు దర్శకుడు రాజమౌళిని మంత్రి హరీష్‌రావు సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. మరిన్ని విజయాలను సాధించాలని ఆకాంక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement