Saturday, April 27, 2024

రేప్‌ కేసులో శ్రీలంక క్రికెటర్‌ సస్పెండ్‌.. అన్ని ఫార్మట్‌ల నుంచి తొలగింపు

మహిళపై లైంగిక దాడి కేసులో శ్రీలంక క్రికెటర్‌ ధనుష్క గుణ తిలక అరెస్టయ్యాడు. ఆదివారం తెల్లవారు జామున సిడ్నీకి చెందిన సిటీ పోలీసులు గుణ తిలకను అదుపులోకి తీసుకున్నారు. అత్యాచార ఆరోపణలతో అరెస్ట్‌ అయిన శ్రీలంక క్రికెటర్‌ గుణ తిలకను సస్పెండ్‌ చేస్తూ లంక క్రికెట్‌ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. తక్షణమే అన్ని ఫార్మట్‌ల నుంచి గుణ తిలకను సస్పెండ్‌ చేస్తున్నామని సెలక్టర్లు అతన్ని పరిగణలోకి తీసుకోవద్దని శ్రీలంక ఎగ్జిక్యూటివ్‌ కమిటీ పేర్కొంది.

ఈ ఘటనపై శ్రీలంక క్రికెట్‌ బోర్డు పూర్తి విచారణ జరుపుతుందని గుణ తిలక దోషి అని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. ఇలాంటి ఘటనలు ఉపే క్షించేది లేదని ఆస్ట్రేలియా అధికారులకు దర్యాప్తుకు సహకరిస్తామని తెలిపింది. ధనుష్క గుణతిలక ఆస్ట్రేలియాలో ప్రపంచకప్‌ ఆడేందుకు గత నెల తన జట్టుతో కలిసి వెళ్లాడు. ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో అతనిపై కేసు నమోదైంది.

దాంతో వరల్డ్‌ కప్‌ నుంచి నిష్క్రమించిన శ్రీలంక జట్టు ఆటగాడు గుణ తిలక కనిపించకుండా పోయాడు. కాగా ప్రపంచకప్‌ ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లిన గుణ తిలక ఫస్ట్‌ రౌండ్‌లో నమీబియాతో జరిగిన ఒకే ఒక మ్యాచ్‌ ఆడి డకౌట్‌ అయ్యాడు. గాయం కారణంగా ఆ తర్వాత టోర్నీకి దూరమై రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఈ క్రమంలో ఓ 29 ఏళ్ల మహిళ గుణ తిలకపై రేప్‌ ఆరోపణలు చేశారు. శ్రీలంక క్రికెటర్‌తో తనకు ఆన్‌లైన్‌ డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయం ఏర్పడిందని, అప్పటి నుంచి ఇద్దరం ఒకరికొకరం ఆన్‌లైన్‌ లో టచ్‌లో ఉన్నామని బాధితురాలు తెలిపింది. ఈ క్రమంలో ఈ నెల 2న సాయంత్రం రోజ్‌ బేలోని తన నివాసానికి వచ్చిన గుణతిలక తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించింది. ఈ నేపథ్యంలో పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement